తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జీ చే న్యాయ విచారణ జరిపించాలి
మంత్రి పదవికి సీతక్క రాజీనామా చేయాలి
ప్రజాసంఘాల నాయకుల డిమాండ్.
హైదరాబాద్, మహా : ములుగు జిల్లా, ఏటూరునాగారం ఏజేన్సీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ పేరుతో ఏడుగురిని పొట్టన పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసు చర్యను ఇఫ్టూ (శ్రామిక స్పందన) జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు షేక్ షావలి, కర్నాటి మల్లేష్, ఐపిఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పెర్క సునీత ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే నైతిక బాద్యత వహించాలని డిమాండ్ చేశారు. అధికారానికి ముందు అధికారం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన పోరాడుతున్న ఉద్యమ కారులపై అణిచివేత కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా, ఎన్ కౌంటర్ పేరుతో దుర్మార్గమైన హత్యలకు పాల్పడడము అమానుష, అప్రజాస్వామిక చర్య అని ఎండగట్టారు. కేంద్రంలో నరేంద్రమోదీ బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో తమ అడవిని, నేలను పరిరక్షిస్తున్న ఆదివాసి గిరిజన ప్రజలపై మావోయిస్టులు అనే ముద్ర వేసి, మారణ హోమానికి పాల్పడుతున్న క్రమంలో, కేంద్ర ప్రభుత్వానికి దీటుగా తాము కూడ బడా కార్పొరేట్ సంస్థల దోపిడీకి, వారి ప్రయోజనాలకు నమ్మకమైన ఏజేంట్లమని రుజువు చేసుకోవడానికి చేసిన రాజకీయ హత్యలన్నారు. అధికారంలోకి ఎవరు వచ్చిన బడా భూర్జువ, భూస్వామ్య, సామ్రాజ్యవాద దళారి దోపిడీ పాలకవర్గ ప్రయోజనాలే తప్ప, ప్రజల ప్రయోజనాలను, పౌర ప్రజాస్వామిక హక్కులను కాలరాచే పాలకులు ఉన్నంత కాలం హత్యలు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉంటాయనే దానికి ములుగు ఎన్ కౌంటర్ ఒక ఉదాహరణ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎక్కడో ముందుగా పట్టుకుని, తీవ్ర చిత్రహింసలకు గురిచేసి, ఆ తర్వాత కాల్చిచంపి, పకడ్బందీగా ఎన్ కౌంటర్ కట్టకథలు అల్లడంలో ఆరితేరిన పోలీసులకు ఇదో కట్టుకథ అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్త శుద్ది ఉన్న ఎన్ కౌంటర్ లో పాల్గొన్న సంబందిత పోలీసు, పోలీసు అధికారులను సస్పెండ్ చేసి, హత్యానేరం కేసులు నమోదు చేయాలని, వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ములుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్కకు ఏమాత్రం ఈప్రాంత గిరిజన ప్రజలపై ప్రేమ అభిమానం ఉన్న వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు.







