Mahaa Daily Exclusive

  రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారమే రాహుల్ గాంధీ నైజం.

Share

  •  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు.
  •  కాంగ్రెస్ దివాళాకోరు తనానికి రాజ్యాంగ సంస్థలపై ఆరోపణలే నిదర్శనం.

న్యూఢిల్లీ, మహా.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యవహారశైలిలో వింత, విచిత్రమైన, ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు తమకు అనుకూలంగా వ్యవహరించినప్పుడు వాటిని ప్రశంసించడం.. అదే ప్రజల్లో తమ పార్టీకి వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ సంస్థలు అవినీతిమయమయ్యాయని, విశ్వసనీయత కోల్పోయాయని దుష్ప్రచారం చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిపోయిందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్ని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)ను, న్యాయవ్యవస్థను, పార్లమెంట్‌ను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవాలని చూడటం, అవి లొంగకపోతే వాటి విశ్వసనీయతను దెబ్బతీయడం కాంగ్రెస్ దివాళాకోరు తనానికి అద్దం పడుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. రాజకీయ లబ్ధికోసమే రాహుల్ గాంధీ నిత్యం తప్పుడు ఆరోపణలు చేస్తూ, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

ఎన్నికల ఓటములను తట్టుకోలేకనే..

దేశ ప్రజలు పదేపదే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరిస్తుంటే అది ఎన్నికల సంఘం తప్పు కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మిమ్మల్ని గెలిపించి ప్రధానిని చేయడం ఈసీ బాధ్యత కాదని, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం వరకే దాని పరిధి అని హితవుపలికారు. ప్రజల్లో విశ్వసనీయతను సంపాదించుకోవడంలో విఫలమై, ఆ నెపాన్ని రాజ్యాంగ సంస్థలపై నెట్టడం సరికాదన్నారు. రాఫెల్ ఒప్పందంపై సీఏజీ నివేదికను వ్యతిరేకించడం, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, సాయుధ బలపాలపై కూడా ఆరోపణలు చేయడం రాహుల్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ద్వారా దేశ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆక్షేపించారు.

కుటుంబ పాలనా సంస్కృతి నుంచి బయటపడాలి..

గతంలో యూపీయే హయాంలో ఆర్డినెన్స్‌ను బహిరంగంగా చించివేసి నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను, సీనియర్ నేత పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ అవమానించిన తీరును దేశం ఇంకా మరిచిపోలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. భారతదేశం రాహుల్ కుటుంబం పాలించే రాజరిక వ్యవస్థ కాదని, రాజ్యాంగ సంస్థలు ఎవరి జేబు సంస్థలు కావని హితవుపలికారు. “మీ తాత తర్వాత మీ నాన్న, మీ నాన్న తర్వాత నాకే దేశాన్ని పాలించే హక్కు ఉందనే రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వం నుంచి రాహుల్ గాంధీ ఇప్పటికైనా బయటకు రావాలి” అని సూచించారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడే కాదని, వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా గౌరవించడమే అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.