- 1,22,753 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం.
- రికార్డు స్థాయిలో 1,64,427 ఓట్లు సాధించిన భాజపా అభ్యర్థి హసిరాణి రథ్.
- పోటీకి దూరంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్.
కోల్‌కతా,మహా.
పశ్చిమ బెంగాల్‌లోని ప్రతిష్టాత్మక నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి హసిరాణి రథ్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌పై ఏకంగా 1,22,753 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 1967 నుంచి ఇప్పటివరకు నందిగ్రామ్‌లో నమోదైన అభ్య్రర్థుల విజేత మెజారిటీల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. ఈ చారిత్రక విజయంతో బెంగాల్ భాజపా శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది.
ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి హసిరాణి రథ్‌కు మొత్తం 1,64,427 ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు 41,674 ఓట్లు దక్కాయి. తృణమూల్ కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ, ఆ పార్టీకి ఓటర్లు గట్టి షాకే ఇచ్చారు. ఇక సీపీఐ అభ్యర్థి శాంతి గోపాల్ గిరి 5,779 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం కాగా, మిగతా అభ్యర్థులందరూ నామమాత్రపు ఓట్లతో సరిపెట్టుకున్నారు.
ఉపఎన్నిక ఎందుకు వచ్చింది?..
ప్రస్తుత బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి గతంలో నందిగ్రామ్ నుంచి ఎన్నికైనప్పటికీ, భవానీపూర్ స్థానం నుంచి కూడా గెలుపొందడంతో ఆయన నందిగ్రామ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. కాగా, ఈ ఎన్నికల్లో భాజపా తరఫున బరిలోకి దిగిన హసిరాణి రథ్.. గతంలో సువేందు అధికారికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసి హత్యకు గురైన చంద్రనాథ్ రథ్ తల్లి కావడం గమనార్హం.
ఈ విజయంపై సువేందు అధికారి హర్షం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు దుష్టపాలనకు చరమగీతం పాడి, అభివృద్ధికి పట్టం కట్టారని కొనియాడారు. మైనారిటీ ఓటర్లు సైతం భారీ సంఖ్యలో భాజపా వైపు నిలిచారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మమతా బెనర్జీ సొంత గడ్డపై భాజపా సాధించిన ఈ లాభం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.







