Mahaa Daily Exclusive

  ఢిల్లీ దిగ్బంధం.. నిరసన సెగ!

Share

  •  ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా డిమాండ్‌తో ఉద్రిక్తత
  •   సెంట్రల్ ఢిల్లీలో 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ బంద్
  •   57 మెట్రో స్టేషన్లు, పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు
  •   భారీగా మోహరించిన భద్రతా బలగాలు.. రంగంలోకి అమిత్ షా

న్యూఢిల్లీ, మహా:

దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), వివిధ విద్యార్థి సంఘాలు శనివారం తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో రాజధానిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీతో సహా పలు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించడంతో పాటు, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా పాల్గొంటామని ప్రకటించడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం నగరంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ, భారీ పోలీసు బలగాలను మోహరించింది.

జంతర్ మంతర్ వద్ద అనుమతి నిరాకరణ.. సెక్షన్ 163 అమలు

నిరసనల కోసం జంతర్ మంతర్ ప్రాంతాన్ని కేటాయించాలని నిర్వాహకులు కోరినప్పటికీ, ఢిల్లీ పోలీసులు దానికి అనుమతి నిరాకరించారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకోవడం, గత ఆందోళనల్లో నిబంధనలు ఉల్లంఘించిన చరిత్ర ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ సీపీ నూపుర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్‌తో పాటు జనపథ్-కర్తవ్య పథ్ కూడలి పరిసరాల్లో భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మొబైల్ ఇంటర్నెట్ బంద్.. రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం

శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ వదంతుల నివారణ చర్యల్లో భాగంగా సెంట్రల్ ఢిల్లీ పరిధిలో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటల వరకు 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు, భద్రతా కారణాలరీత్యా 57 మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను పోలీసులు కోరారు. అలాగే, న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు వచ్చే పలు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేయడం లేదా రీషెడ్యూల్ చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బట్లు ఎదుర్కొంటున్నారు.

సుప్రీంకోర్టు జోక్యం.. కేంద్రం అత్యున్నత సమీక్ష

నిరసనల పేరుతో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం స్పందిస్తూ కీలక సూచనలు చేసింది. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా రవాణా సేవలను కొనసాగించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు, ఈ పరిణామాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నగరవ్యాప్తంగా దాదాపు 25 వేల నుంచి 40 వేల మంది వరకు పారామిలటరీ, పోలీసు బలగాలను రంగంలోకి దించారు. రాజధానిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్సు టెర్మినళ్లు, హోటళ్లు, వసతి గృహాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాలకు ముందే తాజా పరిస్థితులను బేరీజు వేసుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.