- యూపీఐ బాదుడుకు ఉపశమనం
- దీపావళి తర్వాతే ఎండీఆర్ ఛార్జీలు
- వ్యాపారుల అభ్యర్థనతో నిర్ణయం వాయిదా
న్యూఢిల్లీ, మహా: యూపీఐ లావాదేవీలకు సంబంధించి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీల అమలును దీపావళి తర్వాతకు వాయిదా వేసినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. పండగ సీజన్లో వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వ్యాపారులు చేసిన విజ్ఞప్తుల మేరకు ఛార్జీల అమలును నవంబర్ రెండో వారానికి వాయిదా వేసినట్లు పేర్కొంది.
దీపావళి సందర్భంగా మార్కెట్లలో కొనుగోళ్లు, డిజిటల్ చెల్లింపులు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త ఛార్జీల విధానం అమల్లోకి వస్తే వ్యాపారులపై అదనపు భారం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో పండగ సీజన్ ముగిసిన తర్వాతే ఎండీఆర్ ఛార్జీలను అమలు చేయాలని ఎన్పీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అనేది డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వ్యాపారులకు సంబంధించిన లావాదేవీల ఛార్జీ. దీని అమలును నవంబర్ రెండో వారానికి వాయిదా వేయడంతో వ్యాపారులకు తాత్కాలికంగా ఊరట లభించనుంది. అయితే, ఏయే లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి? ఎంత మేర వసూలు చేస్తారు? అనే పూర్తి వివరాలు అధికారిక మార్గదర్శకాల ద్వారా స్పష్టత రావాల్సి ఉంది.







