- ఇక 6 జీ యుగం
- 6జీని ప్రవేశపెట్టే తొలి దేశాల సరసన భారత్
- 5జీతో పోలిస్తే ఐదు రెట్లు అధిక సామర్థ్యం..
- పది రెట్లు తక్కువ లేటెన్సీ లక్ష్యం
- ఐఎంసీ 2026లో ప్రీ-6జీ టెక్నాలజీ ప్రదర్శన
- 8 వేలకుపైగా పేటెంట్లు దాఖలు చేసినట్లు వెల్లడి
న్యూఢిల్లీ, మహా : భారత టెలికాం దిగ్గజం జియో 6జీ సాంకేతికత దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 6జీ ప్రమాణాలు 2030లో ఖరారైనప్పుడు, ఆ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చే తొలి దేశాల్లో భారత్ కూడా ఉండవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. ఇప్పటికే ప్రీ-6జీ టెక్నాలజీ స్టాక్, గిగా మిమో రేడియోను అభివృద్ధి చేసినట్లు జియో వెల్లడించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2026లో వీటిని ప్రదర్శనకు ఉంచింది.
ప్రస్తుత 5జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే 6జీ నెట్‌వర్క్‌లు ఐదు రెట్లు అధిక సామర్థ్యాన్ని అందించగలవని జియో అంచనా వేస్తోంది. అదే సమయంలో డేటా ప్రసారంలో జాప్యాన్ని (లేటెన్సీ) దాదాపు పది రెట్లు తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపింది. దీనివల్ల ఒకేసారి ఎక్కువ డేటాను, అధిక సంఖ్యలో వినియోగదారులను నెట్వర్క్ నిర్వహించగలుగుతుంది. అలాగే వినియోగదారుల ఆదేశాలకు మరింత వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది. డేటా వేగాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. ఈ పరిణామాలతో రియల్‌టైమ్ కృత్రిమ మేధ (ఏఐ), హోలోగ్రాఫిక్ వీడియోలు, వైద్య సేవలు, విద్య, తదితర భవిష్యత్ డిజిటల్ సేవల్లో కొత్త అవకాశాలు అందుబాటులోకి రావచ్చని వివరించింది.
గిగా మిమో రేడియో ప్రత్యేకత
ఐఎంసీ ప్రదర్శనలో జియో అభివృద్ధి చేసిన గిగా మిమో రేడియో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇది భారత్‌లోనే తొలిసారిగా అభివృద్ధి చేసిన సాంకేతికతగా సంస్థ పేర్కొంది. 5జీ, 6జీ రెండింటికీ మద్దతు ఇచ్చే ఉమ్మడి బేస్‌బ్యాండ్ యూనిట్‌ను కూడా జియో ఆవిష్కరించింది.6జీ పోటీ కేవలం అధిక నెట్వర్క్ సామర్థ్యం, వేగవంతమైన స్పందనకే పరిమితం కాదని సంస్థ అభిప్రాయపడింది. భవిష్యత్తులో కనెక్టివిటీని నిర్వచించే సాంకేతికత, ప్రపంచ ప్రమాణాల రూపకల్పనలో భాగస్వామ్యం కావడం కూడా కీలకమని పేర్కొంది. ఈ దిశగా ఇప్పటివరకు 8,000కుపైగా పేటెంట్లు దాఖలు చేసినట్లు జియో వెల్లడించింది. వీటిలో వందల సంఖ్యలో 6జీకి సంబంధించిన పేటెంట్లు ఉన్నాయని తెలిపింది. ప్రపంచ ప్రమాణాల రూపకల్పనకు సంబంధించి 934కుపైగా ప్రతిపాదనలు, సాంకేతిక సహకారాలు అందించినట్లు సంస్థ పేర్కొంది.
రైతులు, వైద్యులు, విద్యార్థులకు ఏఐ సేవలు
6జీ ద్వారా కృత్రిమ మేధ ఆధారిత సేవలు మరింత వేగంగా, సమర్థంగా స్పందించేలా చేయవచ్చని జియో భావిస్తోంది. ముఖ్యంగా తక్షణ సమాచారం, వేగవంతమైన సమాధానాలు అవసరమయ్యే సందర్భాల్లో ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని పేర్కొంది. ఐఎంసీ ప్రదర్శనలో రైతులు, వైద్యులు, విద్యార్థుల కోసం ఏఐ ఆధారిత సేవలు అందించే అవకాశాలను సంస్థ వివరించింది. ఏఐ ఆధారిత నెట్‌వర్క్‌లు, క్వాంటమ్ సాంకేతికతకు సైతం తట్టుకోగల భద్రతా వ్యవస్థల అభివృద్ధిపైనా జియో దృష్టి సారించింది. వేగవంతమైన కనెక్టివిటీతోపాటు మరింత పటిష్ఠమైన భద్రతను అందించే నెట్‌వర్క్‌లను రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది.







