Mahaa Daily Exclusive

  హాస్టళ్ల టెండర్లలో రూ.66 కోట్ల అవినీతి…..

Share


హాస్టళ్ల టెండర్లలో రూ.66 కోట్ల అవినీతి.

* పీఎంయూ విధానాన్ని రద్దు చేయాలి.

* మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు .

హైదరాబాద్, మహా:

గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సరుకుల సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కేంద్రీకృత పీఎంయూ (ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్) టెండర్ల విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అవినీతికి కేంద్ర బిందువుగా మారిన ఈ కేంద్రీకృత విధానాన్ని పక్కనపెట్టి, గతంలో మాదిరిగానే స్థానిక వెండర్ల ద్వారా ప్రభుత్వ హాస్టళ్లకు నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ పెద్దలు కమీషన్లకు కక్కుర్తి పడి బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న సంస్థలకు టెండర్లు కట్టబెట్టడం అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు.

నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టులు అప్పగిస్తూ ఒక్కో జిల్లాకు రూ. 2 కోట్ల చొప్పున మొత్తం రూ. 66 కోట్ల మేర గుడ్‌విల్ వసూలు చేశారని హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. బిల్లుల్లో ప్రతి నెలా 20 శాతం కమీషన్లు దండుకుంటూ పేద విద్యార్థుల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వ్యాపారులు అందించే ధరల కంటే 35 నుంచి 45 శాతం అధిక ధరకు కాంట్రాక్టులను ఖరారు చేసినప్పటికీ, నేటికీ విద్యార్థులకు సరుకులు సరఫరా చేయలేని చేతకాని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టి మూడు నెలల్లోనే విఫలమై రద్దు చేసిన ఈ విధానాన్ని, తెలంగాణలో ఎవరి స్వలాభం కోసం రుద్దుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

పాత విధానాన్ని కొనసాగించడం ద్వారా సరుకులు సరఫరా చేసే వేలాది మంది చిరు వ్యాపారుల జీవనోపాధిని కాపాడటంతో పాటు, విద్యార్థులకు ఎప్పటికప్పుడు నాణ్యమైన, తాజా ఆహారం అందుతుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. పాఠశాలను ఒక యూనిట్‌గా పరిగణించి, డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ ద్వారా స్థానిక వ్యాపారులకే సరుకుల సరఫరా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే ఈ కేంద్రీకృత టెండర్లను రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించకపోతే, ఉపాధి కోల్పోతున్న బాధిత కుటుంబాలు, పేద విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Latest