Mahaa Daily Exclusive

  ఆత్మకూరు బైపాస్‌కు ‘వాయుపుత్ర’…

Share

ఆత్మకూరు బైపాస్‌కు ‘వాయుపుత్ర’.

* వర్చువల్‌గా ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌.

నెల్లూరు, మహా:

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన బైపాస్‌ రహదారికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ‘వాయుపుత్ర’గా నామకరణం చేశారు. ఈ నాలుగు వరుసల రహదారిని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మంత్రి ఆనం చొరవతోనే ఈ బైపాస్‌ రహదారి అభివృద్ధి సాధ్యమైందని ప్రశంసించారు. సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రోడ్డు ద్వారా ముంబై జాతీయ రహదారి నుంచి ఆత్మకూరు పట్టణానికి మెరుగైన అనుసంధానం ఏర్పడిందని తెలిపారు. దీంతో పట్టణంలోని ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ తగ్గి, ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయని వివరించారు.

మరోవైపు, నెల్లూరు నగరాన్ని పర్యాటకులను ఆకర్షించేలా అత్యంత సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. నగరంలోని మినీ బైపాస్‌ రోడ్డులో జరుగుతున్న ఐకానిక్‌ జాతీయ జెండా ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. నుడా ఆధ్వర్యంలో 105 అడుగుల ఎత్తైన స్తంభంపై ఏర్పాటు చేస్తున్న ఈ జాతీయ జెండా నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెప్పారు. పౌరుల్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో స్వాతంత్ర్య సమరయోధులు, దండి యాత్రకు సంబంధించిన చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, ‘ఐ లవ్‌ నెల్లూరు’ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

Latest