ఢిల్లీ నిరసనలపై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ….సీజేఐ కీలక వ్యాఖ్యలు.
న్యూఢిల్లీ, మహా.
దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న నిరసనల పరిణామాలపై దాఖలైన పలు పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనల విషయంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించారంటూ జర్నలిస్టులు దాఖలు చేసిన పిటిషన్ను సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ మంగళవారం ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. దీనిపై స్పందించిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్.. ఈ పిటిషన్లపై విచారణ జరపాలంటే సంబంధిత కేసుకు సంబంధించిన సమగ్ర ఫైళ్లను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణను స్వీకరిస్తామని స్పష్టం చేస్తూనే, నేడు అది సాధ్యం కాదని, రేపు విచారణ చేపడతామని తెలిపారు.
మరోవైపు, నిరసనల సమయంలో న్యాయవాదులపై దాడులు జరిగాయంటూ బార్ సభ్యులు దాఖలు చేసిన మరో పిటిషన్ను సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా నేడే విచారించాలని ఆయన కోరగా, నేడు విచారణ జరపడం సాధ్యపడదని సీజేఐ స్పష్టం చేశారు. ధర్మాసనంలోని జస్టిస్ మోహన జ్వరంతో, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ బాధ్యతతో విచారణకు హాజరయ్యారని ఈ సందర్భంగా సీజేఐ ప్రస్తావించారు. పిటిషన్లలో ఉన్న సాంకేతిక లోపాలను ముందుగా సరిదిద్దుకోవాలని న్యాయవాదులకు సూచించారు. లోపాలు సరిచేస్తే సంబంధిత పిటిషన్లన్నింటినీ విచారణ జాబితాలో చేరుస్తామని చెప్పారు. బుధవారం ఉదయం 11:00 నుంచి 11:30 గంటల మధ్య వీటిపై విచారణ చేపట్టే అవకాశముందని పేర్కొంటూ, ఇవి అత్యంత తీవ్రమైన అంశాలని, లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.







