నల్లగొండకు నీళ్లు రాకుండా అధికారుల కుట్ర!
* పాలకులపై ఒత్తిడి తెచ్చి జిల్లాకు అన్యాయం చేస్తున్నారు.
* శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్.
నల్లగొండ,మహా:
నల్లగొండ జిల్లాలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చి జిల్లాకు చుక్క నీరు రాకుండా చేస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం నల్లగొండలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ సాగునీటి పంపిణీపై అధికారుల తీరును ఎండగట్టారు.
నల్లగొండ జిల్లాకు నీళ్లు ఎలా ఇస్తారంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రిపైనే కొందరు అధికారులు ఒత్తిడి తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు స్వార్థపరుల మాటలు విని సీఎం కానీ, మరెవరైనా కానీ జిల్లాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం కేవలం ఏడు లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని, మిగిలిన ప్రాంతాల రైతులు నీళ్ల కోసం ఆకాశం వంక చూడాల్సిన దుస్థితి నెలకొందని ఆయన గుర్తుచేశారు.
నీళ్లన్నీ కేవలం పాలమూరు ప్రాజెక్టులకే కావాలని అనడం ఏమాత్రం సమంజసం కాదని గుత్తా స్పష్టం చేశారు. ఒకవైపు జిల్లా రైతాంగం అల్లాడుతుంటే, డిండి ప్రాజెక్టుకు నీళ్లు కేటాయించవద్దని అధికారులు అనడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. పాలమూరులో 25 టీఎంసీల సామర్థ్యం ఉన్న భారీ రిజర్వాయర్లను ఘనంగా ప్రారంభించారని, అయితే ఆ రిజర్వాయర్లకు అసలు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకువస్తారో, వాటిని ఎలా నింపుతారో అనే కనీస ప్రణాళిక కూడా అధికారుల వద్ద లేదని ఆయన విమర్శించారు. సరైన ప్లాన్ లేకుండా ప్రాజెక్టులు కట్టి, తీరా నల్లగొండకు రావాల్సిన నీటిని అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. పక్షపాత వైఖరి విడనాడి, అన్ని జిల్లాలకు సమన్యాయం జరిగేలా పాలకులు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.








