ఢిల్లీ, మహా.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిబంధనలను ఉల్లంఘించి నిరసనకు దిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీ ముఖ్య నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఐదు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఢిల్లీలోని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న మరో నేత అజింక్యా షిండేను రూ.5,000 వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయస్థానం విడుదల చేసింది.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 14 మంది సీజేపీ సభ్యులు జంతర్ మంతర్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. నిరసనలకు అనుమతి లేని ఆ ప్రాంతంలోకి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని, ప్రైవేటు ఆస్తుల గుండా చొరబడి వారు జాతీయ జెండాను ఎగురవేస్తూ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సౌరవ్, అశుతోష్ ఇరువురూ గతంలో కూడా ఇదే తరహా చర్యలకు పాల్పడి శాంతిభద్రతల ఒప్పందాన్ని ఉల్లంఘించారని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న మేజిస్ట్రేట్ వారిద్దరినీ తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించారు.
ఈ అరెస్టుల పట్ల సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ విధించాలనుకుంటే ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉంటే అధికారికంగా ప్రకటించాలని, కేవలం జాతీయ జెండా పట్టుకుని నిరసన తెలిపినందుకు ఐదు రోజుల పాటు జైల్లో పెట్టడం అప్రకటిత ఎమర్జెన్సీకి నిదర్శనమని ఆయన విమర్శించారు. కాగా, ఇటీవల ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ను అధికారిక నిరసనల వేదిక జాబితా నుంచి తొలగించారు. అనుమతి లేని ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించడం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం తదితర అభియోగాల కింద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







