- ఓట్ చోరీకి వ్యతిరేకంగా
- ఈ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తప్పించాలన్నదే ప్రధాన డిమాండ్
- రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు ఇండీ కూటమి నేతలు హాజరు
- ఒకటి రెండు రోజులలో ఏర్పాట్లపై రానున్న స్పష్టత
హైదరాబాద్, మహా : ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ వేదికగా ఈ సభను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని పార్టీ నేతలు తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం, సుమారు ఒక లక్ష మంది ప్రజలతో సభను విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ఢిల్లీలో ఇండీ కూటమి ఆందోళన కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్వహిస్తున్న కీలక సమావేశాలకు హాజరవుతూ సర్ ప్రక్రియతో పాటు సీఈసీకి వ్యతిరేకంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ఆందోళనలపై చర్చలు జరుపుతున్నారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించేంత వరకు తమ పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇదివరకే తెలిపారు. ఢిల్లీలోని రాహుల్గాంధీ నివాసంలో మంగళవారం నిర్వహించిన భేటీలో ఈ విషయంపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు. సీఈసీ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలో కోట్లాది ప్రజలు ఓటు హక్కును కోల్పోతున్నారని ఆరోపించారు. గతంలో బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓట్లు తొలగించిన తరువాత బీజేపీ అక్కడ విజయాలు సాధించిందని ఆరోపించారు. మహారాష్ట్రలోనూ గెలిచే అవకాశం లేని అభ్యర్థులు విజయాలు సాధించారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లతో పాటు పేదలు, దళితుల ఓట్లు, కొన్ని వర్గాలు ఓట్లను సర్ ప్రక్రియ సాకుతో తొలగించి లబ్ధి పొందుతున్నారని మమహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
హైదరాబాద్ లో నిర్వహించే బహిరంగ సభకు కాంగ్రెస్ నేతలతో పాటు ఇండీ కూటమి నేతలు పలువురు హాజరయ్యే అవకాశాలున్నాయని గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. సభను ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై ఒకటి రెండు రోజులలో స్పష్టతకు రాగానే ఏర్పాట్లను వేగవంతం చేయాలని పార్టీ భావిస్తోంది. ఢిల్లీలో వరుసగా జరుగుతున్న ఆందోళనలను క్రమక్రమంగా దేశ వ్యాప్తంగా విస్తరించి అన్ని రాష్ట్రాలలో ప్రజలను చైతన్యం చేయాలనుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం హైదరాబాద్ కేంద్రంగా బహిరంగసభ ద్వారా మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
జంతర్ మంతర్ తొలగించడంపై కాంగ్రెస్ మండిపాటు
ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిరసనల వేదికల జాబితా నుంచి తొలగించడాన్ని కాంగ్రెస్ సహా ఇండీ కూటమి తీవ్రంగా తప్పుపట్టింది. ప్రశాంత వాతావరణంలో నిరసనలు తెలుపుతుంటే, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నారన్న కారణంగా అరెస్టులు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. సర్ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో అక్రమంగా తొలగించిన ఓట్ల వివరాలను వెల్లడిస్తానని, వేదిక ఎక్కడో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చాలెంజ్ చేయగా.. తాను ఛాలెంజ్ స్వీకరించానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు చెప్పడంతో సర్ వివాదం మరింత ముదురుతోంది.








