Mahaa Daily Exclusive

  కారేపల్లి పశువైద్యశాలకు తాళం.. పశుపోషకులకు తిప్పలు!

Share

  • కారేపల్లి పశువైద్యశాలకు తాళం.. పశుపోషకులకు తిప్పలు!
  • వైద్యాధికారి ఆంధ్రకు.. అసిస్టెంట్ ఖమ్మంకు!
  • సిబ్బంది గైర్హాజరుతో వైద్యసేవలకు ఆటంకం?
  • ఫొటోలు తీస్తే మీడియాపై గోపాలమిత్ర ఆగ్రహం!

కారేపల్లి,మహ: కారేపల్లి ప్రభుత్వ పశువైద్యశాలలో సిబ్బంది అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. బుధవారం వైద్యాధికారి ఇందిరా డెయిరీకి సంబంధించిన గేదెల ఎంపిక కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లగా, వెటర్నరీ అసిస్టెంట్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఖమ్మం వెళ్లినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ పశువైద్యశాలకు తాళం పడటంతో సేవల కోసం వచ్చే పశుపోషకులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.

ఫొటోలు తీస్తే ఆగ్రహం!

తాళం వేసిన కార్యాలయాన్ని మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తుండగా, గోపాలమిత్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది భోజనానికి వెళ్లారని చెప్పినట్లు తెలిసింది. అనంతరం కార్యాలయాన్ని తెరిచినట్లు సమాచారం. సిబ్బంది అందుబాటులో లేని సమయంలో కార్యాలయ నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అధికారుల పర్యవేక్షణ ఏది?

ప్రభుత్వ పశువైద్యశాలలో సిబ్బంది అందుబాటులో లేకపోతే పశువులకు అత్యవసర వైద్యం అందడంపై ప్రభావం పడే అవకాశం ఉంది. విధుల నిర్వహణ, కార్యాలయం మూసి ఉన్న వ్యవధిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, పశుపోషకులకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై వివరణ కోసం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.