- జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం
- రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
- రోజు వారీ విచారణకు హాజరవాలని ఈడీ లాయర్లకు ఆదేశం
హైదరాబాద్, మహా : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కేసులతోపాటు ఈడీ కేసులనూ రోజువారీగా విచారించాలని స్పష్టం చేసింది. రోజువారీ విచారణకు హాజరుకావాలని ఈడీ లాయర్లకు సైతం సూచించింది. సీబీఐ కోర్టులో పదేళ్లుగా 9 ఈడీ ఛార్జిషీట్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటితో పాటు డిశ్చార్జి పిటిషన్లు సైతం తేలకపోవడంతో ఈడీ కేసుల విచారణ ముందుకు సాగడం లేదు. ఈ పరిణామాలతో ఈడీ కేసులను రోజువారీగా విచారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటివరకు ప్రధానంగా సీబీఐ కేసులనే కోర్టు విచారిస్తూ వస్తోంది. దీంతో తమ కేసులను కూడా విచారించాలని, కేసు త్వరగా తేలేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని కోరుతూ ఈడీ పిటిషన్ వేసింది. ఈ క్రమంలో స్పందించిన సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం నుంచి ఈడీ కేసులను సీబీఐ కోర్టు వరుసగా రోజువారీ ప్రాతిపదికన విచారించే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవల ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈడీ పిటీషన్ను స్పందిస్తూ మాట్లాడారు. జగన్ పై కేసులను రోజువారీగా కాదు, రోజు మొత్తం విచారణ చేపట్టేలా కోర్టులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానులు, ఉప ప్రధానుల మీద నమోదైన కేసుల్లోనే కేవలం 3 ఏళ్లలో తీర్పులు వచ్చాయని గుర్తు చేశారు. వీపీ సింగ్, పీవీ నరసింహారావుల మీద నమోదైన కేసుల్లోనే తక్కువ సమయంలోనే తీర్పులు వచ్చాయని, కానీ జగన్ అంతకంటే గొప్ప వ్యక్తా అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి విచారణే ప్రారంభం కాని కేసులు ఉన్నాయని, సాధ్యమైనంత త్వరగా కేసుల విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ ఓ టర్మ్ సీఎంగా సైతం చేశారని.. కనుక సీబీఐ, ఈడీ రోజువారీ కాదు రోజుమొత్తం జగన్ కేసులపై విచారణ చేపట్టి వాస్తవాలు తేల్చాలన్నారు.








