జనసేనలోకి వంగవీటి రాధా.
* బెజవాడ రాజకీయాల్లో భారీ కుదుపు.
* పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలోకి.
* జనసేనలో మోగిన కాపు భేరీ.
అమరావతి, మహా.
ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా బెజవాడ రాజకీయ చదరంగంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా, దివంగత నేత వంగవీటి మోహన్ రంగా వారసుడిగా చెరగని ముద్ర వేసుకున్న వంగవీటి రాధా జనసేన గూటికి చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన వేళ రాధా తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన తరఫున కీలక పాత్ర పోషించేందుకు ఆయన సిద్ధమయ్యారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
పవన్ సమక్షంలో.. జనసేనలో నయా జోష్!
కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో సైలెంట్ గా ఉన్న వంగవీటి రాధా అనూహ్యంగా సైకిల్ దిగి జనసేనానితో చేతులు కలిపారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ స్వయంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాపు సామాజిక వర్గంలో విశేషమైన పట్టు, యువతలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న రాధా ఎంట్రీతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. దశాబ్దాలుగా బెజవాడ రాజకీయాలను శాసిస్తున్న వంగవీటి కుటుంబం నుంచి రాధా జనసేనలో అడుగుపెట్టడం అధికార, విపక్ష శిబిరాల లెక్కలను పూర్తిగా మార్చేయనుంది.
బెజవాడ మేయర్ పీఠమే టార్గెట్?
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వేళ వంగవీటి రాధా జనసేనలో చేరడం వెనుక భారీ వ్యూహమే ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన మేయర్ అభ్యర్థిగా రాధా బరిలోకి దిగుతారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. బెజవాడ వీధుల్లో రంగా పేరుకు ఉన్న బలమైన సెంటిమెంట్, రాధాకున్న మాస్ ఇమేజ్ను అస్త్రంగా మలచుకుని విజయవాడ పీఠాన్ని కైవసం చేసుకోవాలని జనసేన మాస్టర్ స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది.
కాంగ్రెస్ నుంచి జనసేన దాకా.. సంచలన ప్రస్థానం!
వంగవీటి రాధా రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ సంచలనాల మయమే. 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసి విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత తన పంథాను మార్చుకున్నారు. ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్, ఆ తదుపరి తెలుగుదేశం పార్టీల్లో కీలక పాత్ర పోషించారు. మారిన పార్టీల కన్నా, ఆయన వెంట నడిచే మాస్ ఫాలోయింగ్ ఎప్పుడూ ఆయన సొంత బలాన్ని నిరూపిస్తూనే ఉంది. ఇప్పుడు తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పవన్ తో చేయి కలిపి తన పయనంలో మరో కీలక ఘట్టానికి నాంది పలికారు.
బెజవాడ రాజకీయ ముఖచిత్రం మారనుందా?
విజయవాడ అనగానే రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రత్యేక స్థానం గురించి వేరే చెప్పనక్కర్లేదు. రంగా పేరు చెబితే ఇప్పటికీ బెజవాడ నలుమూలల ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఆ ఇమేజ్ కు ఇప్పుడు పవన్ కల్యాణ్ చరిష్మా తోడైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులకు చుక్కలు కనిపించడం ఖాయం. ఒకవేళ రాధా మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిస్తే.. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకే కేంద్రబిందువుగా మారడం తథ్యం. ఏళ్ల తరబడి బెజవాడ రాజకీయాలను శాసించిన రంగా వారసుడి ఈ కొత్త అడుగు.. స్థానిక పోరులో మునుపెన్నడూ చూడని ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.








