- టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ దూకుడు
- మరో రూ. 129.85 కోట్ల చర, స్థిరస్తులు ఆటాచ్
- మొత్తం ఆటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ. 132. 55 కోట్లని వెల్లడి
- ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసిన ఈడీ
- హవాలా లింకులపై కొనసాగుతున్న దర్యాప్తు
హైదరాబాద్, మహా : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), 2002 కింద రూ.129.85 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. భోలే బాబా ఆర్గానిక్ డెయిరీమిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు, వాటి ప్రమోటర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వారి కుటుంబ సభ్యులు, సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్ కైలాశ్ చంద్ మంగ్లా, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇతర సంబంధిత వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తులను జప్తు ప్రక్రియలో భాగంగా అటాచ్ చేసినట్లు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం వెల్లడించింది.
ఇద్దరు ప్రమోటర్ల అరెస్ట్
ఈ కేసులో భోలే బాబా ఆర్గానిక్ డెయిరీమిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ విపిన్ జైన్, సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్, డైరెక్టర్ కైలాశ్ చంద్ మంగ్లాలను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. కల్తీ నెయ్యి తయారీ, టీటీడీకి అక్రమంగా సరఫరా చేసే వ్యవహారాన్ని వీరు నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ కేసులో, పీఎంఎల్ఏ సెక్షన్ 17 కింద గతంలో స్వాధీనం చేసుకున్న, స్తంభింపజేసిన ఆస్తులతో పాటు, తాజాగా జప్తు చేసిన రూ.129.85 కోట్ల విలువైన ఆస్తులను కలుపుకుని, ఇప్పటివరకు మొత్తం రూ.132.55 కోట్ల విలువైన ఆస్తులపై చర్యలు తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ వ్యవహారంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆ సంస్థ పేర్కొంది.
హవాలా లింకులు.. ఈడీ దర్యాప్తు
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసేందుకు నేరపూరిత కుట్ర, మోసం, నకిలీ పత్రాల సృష్టి, అవినీతికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ లో ఆరోపణలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సంబంధిత దర్యాప్తు సంస్థ నెల్లూరులోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్, అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడం ద్వారా టీటీడీని మోసం చేయడంతో పాటు ప్రజారోగ్యానికి ముప్పు కలిగించి, భారీగా అక్రమ లాభాలు ఆర్జించినట్లు అందులో పేర్కొంది.
రూ.234.5 కోట్ల కల్తీ నెయ్యి సరఫరా
టీటీడీకి నేరుగా, మధ్యవర్తి డైరీల ద్వారా మొత్తం రూ. 234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని ‘భోలే బాబా’ సంస్థ సరఫరా చేసిందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. టీటీడీ టెండర్లలో తమ సొంత పేర్లతో పాల్గొన్న కొన్ని డైరీలు, కమిషన్ కోసం మధ్యవర్తులుగా వ్యవహరించాయని దర్యాప్తు సంస్థ గుర్తించింది. వాస్తవానికి, ఆ కల్తీ నెయ్యి ‘భోలే బాబా’, ‘సుకృతి ఫుడ్స్’ కంపెనీల కేంద్రాలలోనే తయారు చేసినట్లు పేర్కొంది.శుద్ధి చేసిన పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్లను మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్స్, లాక్టిక్ యాసిడ్, బీటా-కెరోటిన్ వంటి రసాయనాలతో కలిపి నెయ్యిని తయారు చేసినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. అయితే, ఈ పదార్థాలను ఇన్వాయిస్లలో తినదగిన నూనెలుగా పేర్కొన్నారు. ఖాతాలలో నిజమైన వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా కనిపించేలా చేయడానికి నకిలీ కొనుగోళ్లు, అమ్మకాలను నమోదు చేసినట్లు కూడా దర్యాప్తులో గుర్తించారు.
కల్తీ నెయ్యి తయారీలో వినియోగించిన పామాయిల్‌ను బోగస్ కొనుగోలుదారులకు విక్రయించినట్లు రికార్డుల్లో చూపించినట్లు ఈడీ తెలిపింది. అదే సమయంలో పాలు, నెయ్యి కొనుగోళ్లు జరిగినట్లు, స్కిమ్డ్ మిల్క్ వంటి ఉప ఉత్పత్తులను విక్రయించినట్లు కల్పిత లావాదేవీలను నమోదు చేసి, నిజమైన డెయిరీ కార్యకలాపాలు జరుగుతున్నట్లు చిత్రీకరించినట్లు పేర్కొంది. ఈ నకిలీ కొనుగోళ్ల కోసం బ్యాంకింగ్ మార్గాల ద్వారా చెల్లించిన మొత్తాలను హవాలా మార్గాల ద్వారా నగదు రూపంలో తిరిగి రాబట్టుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నగదును నకిలీ పామాయిల్ కొనుగోలుదారులకు చెల్లింపులు చేయడానికి, మధ్యవర్తి డెయిరీలకు కమీషన్లు చెల్లించడానికి, ఈ ప్లాన్‌లో పాలుపంచుకున్న ఇతర వ్యక్తులకు ప్రతిఫలాలు అందించడానికి ఉపయోగించినట్లు ఈడీ వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 3న ఈడీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఉత్తరాఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 16 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టింది. ప్రధాన నిందితులు, మధ్యవర్తి డెయిరీలు, రసాయన సరఫరాదారులు, నకిలీ ఆర్థిక లావాదేవీలకు సహకరించిన వ్యక్తులకు సంబంధించిన ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా రూ.2.7 కోట్ల నగదు, బ్యాంకు నిల్వలను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్తంభింపజేసినట్లు ఈడీ తెలిపింది.








