- దర్శి చైర్మన్ పీఠం కైవసం
దర్శి, మహా : తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒక్కసీటుకే పరిమితమైన జనసేన.. రెండో ప్రయత్నంలో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయదుందుబి మోగించింది. ఆపై స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఈ కూటమి పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏపీ మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ… పోలింగ్ జరగకుండానే కూటమి ఖాతాలో 6 చైర్ పర్సన్ స్థానాలు ఏకగ్రీవం అవుతున్నాయి. ఈ క్రమంలో తొలి విక్టరీ జనసేన దక్కించుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి దారం సుబ్బారావు మున్సిపల్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం (అక్టోబర్ 18న) నామినేషన్ల గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసే సమయానికి.. వైసీపీ తరఫున ఎలాంటి నామినేషన్ రాకపోవడంతో దర్శి మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతు తెలిపి బరిలో నిలిపిన దారం సుబ్బారావు ఎన్నిక లాంఛనమైంది.
జనసేన పార్టీ చరిత్రలోనే మొట్టమొదటి మున్సిపల్ ఛైర్మన్ పీఠం దర్శి కావడంతో జనసైన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ నేతలు, జనసైనికులు సంతోషంగా ఉంటారు. కూటమి శ్రేణులు దర్శి వీధుల్లో బాణసంచా కాలుస్తూ భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి రాజకీయ దూకుడుతో వైసీపీ డిఫెన్స్‌లో పడిపోయింది. ఈ క్రమంలో మొత్తం 25 మంది వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు మూడోరోజైన శనివారం సైతం నిర్ణీత సమయానికి నామినేషన్లు దాఖలు చేయలేక వెనుదిరగాల్సి వచ్చింది.
అయితే దర్శి మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఏకగ్రీవ పరిణామం రాజకీయ దుమారానికి తెరతీసింది. తాను నామినేషన్ వేయడానికి వెళ్తుండగా కూటమి పార్టీల కార్యకర్తలు, రౌడీ మూకలు తనను అడ్డుకున్నారని దర్శి వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి వెన్నపూస వెంకటరెడ్డి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం హాట్ టాపిక్ అయింది. నామినేషన్ వేయకుండా తనపై దాడి చేసి తీవ్రంగా అవమానించారని, రాజ్యాంగం కల్పించిన పోటీ చేసే హక్కును కాలరాశారని అన్నారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, చివరి రోజున కూడా తన నామినేషన్ దాఖలు చేసుకునేలా అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకుని.. నామినేషేన్ వేసేందుకు ఏపీ ఎన్నికల కమిషనర్ తనకు అవకాశం ఇవ్వాలన్నారు. వైసీపీ చైర్మన్ అభ్యర్థి దారం సుబ్బారావు నామినేషన్ వేయకపోవడంతో జనసేన అభ్యర్థి దారం సుబ్బారావు దర్శి మున్సిపల్ పీఠంపై కూర్చోవడం దాదాపు ఖాయమైంది. ఏపీలో 6 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీలలో వైసీపీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం ఖాయమని వినిపిస్తోంది.








