Mahaa Daily Exclusive

  మోగిన మరో ఎన్నికల నగారా

Share

 

  • ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
  • ఈ నెల 21 నుండి 23 వరకు మండల, జడ్పీ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ
  • వెల్లడించిన ఎస్ఈసీ అనిల్ చంద్ర పుణేఠా

అమరావతి, మహా : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఎెన్నికల కమిషర్ అనిల్ చంద్ర పునేఠా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధిత మండల కేంద్రాల్లో, జడ్పీటీసీ స్థానాలకు జిల్లా పరిషత్ (జడ్పీ) కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపడతారని వెల్లడించారు. జడ్పీ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నిక జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.

అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అక్టోబర్ 24న పరిశీలిస్తారు. అనంతరం పోటీ నుంచి వైదొలగాలనుకునే అభ్యర్థులకు అక్టోబర్ 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు విజేతల్ని ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి సరిగ్గా అమలయ్యేలా పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక నోడల్ అధికారులను ఈసీ నియమించింది.

ముఖ్యమైన తేదీలివే

ఏపీలో తొలిసారి 28 జెడ్పీ చైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల ప్రజా పరిషత్‌ల పరిధిలో ఉన్న659 జడ్పీటీసీ, 659 ఎంపీపీ స్థానాలకు, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. 2 కోట్ల 81 లక్షల మందికి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నోటిఫికేషన్ విడుదలతో ఏపీలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది.

ఎన్నికల షెడ్యూల్ ముఖ్య తేదీలు

– ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 19

– ఆర్ఓ/ఈవో ఎన్నికల నోటీసు జారీ, నామినేషన్ల ప్రారంభం: అక్టోబర్ 21

– నామినేషన్ల స్వీకరణ ఆఖరి తేదీ: అక్టోబర్ 23, 2026

– నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 24, 2026

– తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్: అక్టోబర్ 25, 2026

– అప్పీళ్ల పరిష్కారించే తేదీ: అక్టోబర్ 26

– నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ: అక్టోబర్ 27

– పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా: అక్టోబర్ 27, 2026

– పోలింగ్ తేదీ: నవంబర్ 03, 2026

– రీపోలింగ్ (అవసరమైతే): నవంబర్ 04, 2026

– ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన: నవంబర్ 05, 2026

మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా

కడప జిల్లా మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు అనిల్‌చంద్ర పునేఠా ప్రకటించారు. నామినేషన్‌ పత్రాలను చించివేసినందున వాటిని పరిశీలించలేమని, ఈ క్రమంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కడప జిల్లా కలెక్టర్‌ నివేదిక మేరకు మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేసినట్లు ప్రకటించారు. త్వరలోనే మైదుకూరు ఎన్నికల ప్రకియకు మళ్లీ నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు.