- హైదరాబాద్ లో సైన్యాధికారి భార్యను అరెస్టు చేసిన జమ్ముకశ్మీర్ పోలీసులు
హైదరాబాద్, మహా : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో చైనాకు భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలపై సికింద్రాబాద్‌కు చెందిన ఓ మహిళపై జమ్మూ కశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన రహస్య సమాచారంపై కీలక డాక్యుమెంట్లను ఆమె గూఢచర్యం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్‌కు చెందిన ఈ మహిళ జమ్మూ కశ్మీర్లో సైనికాధికారి భార్య కావడం గమనార్హం. ఆమె 2021లో బెంగళూరులో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, 2022లో జెనీవాలో మాస్టర్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ పూర్తి చేశారు. అలాగే 2023లో ఐక్యరాజ్యసమితిలో ఐటీ రంగంలో ఇంటర్న్‌షిప్ చేసి, ప్రస్తుతం ఫ్రీలాన్స్ పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. దేశ రక్షణ, భద్రత, భౌగోళిక రాజకీయ అంశాలు, ఎల్ఓసీ వెంట పరిస్థితులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, డ్రోన్ల మోహరింపుపై ఆమె విశ్లేషణలు రాసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14న పఠాన్‌కోట్ వెళ్లేందుకు జమ్మూతావి రైల్వే స్టేషన్‌కు రాగా, కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో ఆమెను అదుపులోకి తీసుకుని సైనిక స్థావరానికి తరలించారు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.
ఓపెన్ ఏఐ ద్వారా
ఐక్యరాజ్యసమితి ఇంటర్న్‌షిప్ సమయంలో విదేశీయులతో, చైనీయులతో వాట్సాప్‌లో చాట్ చేసినట్లు, 2024లో మలేసియా జాతీయుల ద్వారా చైనా నిఘా వర్గాలతో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీల ద్వారా సమాచారం సేకరించానని ఆమె చెబుతున్నప్పటికీ, ఆమె ఫోన్లో భారత్-ఇటలీ రక్షణ బంధం, ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటన, భారత్-రష్యా ఒప్పందాలు, అరుణాచల్ ప్రదేశ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు సంబంధించిన రహస్య అంశాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆమెపై అధికార రహస్యాల చట్టం, గూఢచర్యం, నేరపూరిత కుట్ర, జాతీయ సార్వభౌమత్వానికి వ్యతిరేక చర్యల కింద కేసులు నమోదు చేశారు. ఈ విచారణకు ప్రత్యేకంగా డీఎస్పీని నియమించారు. ప్రస్తుతం ఆమె డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.








