Mahaa Daily Exclusive

  స్థానిక ఎన్నికలపై హైకోర్టులో వైసీపీకి చుక్కెదురు

Share

  • కేంద్ర బలగాలను దింపాలన్న వాదనలో పసలేదన్న కోర్టు

అమరావతి, మహా : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఎన్నికల్లో పారామిలటరీ (కేంద్ర సాయుధ) బలగాలను కేటాయించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని, రాష్ట్ర పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరారు.

ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి.. ఇతర రాష్ట్రాలతో ఏపీలోని పరిస్థితులను పోల్చలేమని పేర్కొంటూ, కేంద్ర బలగాల మోహరింపు అభ్యర్థనను తోసిపుచ్చారు. అయితే నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీల ఏర్పాటు, తగిన భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం సైతం సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ, కేంద్ర బలగాల కేటాయింపునకు సంబంధించిన అభ్యర్థలను తోసిపుచ్చింది. దీంతో ఈ అంశంపై వైసీపీకి హైకోర్టులో చుక్కెదురైనట్లయింది.