Mahaa Daily Exclusive

  ఎల్ నినో పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Share

  • భట్టి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీఎల్ నినోపై
  • సమీక్షించి సలహాలు, సూచనలున సబ్ కమిటీ పని

హైదరాబాద్, మహా : రాష్ట్రంపై ఎల్‌ నినో ప్రభావం, దాని పర్యవసానాలపై సమీక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఈ క్యాబినెట్ సబ్-కమిటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలను సభ్యులుగా నియమించింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా సీఎం సలహాదారు రామకృష్ణారావును నియమించగా… సబ్-కమిటీ కన్వీనర్‌గా ప్రణాళిక శాఖ కార్యదర్శి వ్యవహరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు వెలువరించారు.

ఎల్‌నినో, రాష్ట్రంలో కరువు పరిస్థితులపై మంత్రివర్గ ఉప-సంఘం సమీక్షించి.. సంబంధిత శాఖలకు ఎప్పటికప్పుడు ఆదేశాలు, సూచనలు, సలహాలు అందజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై కూడా నివేదికలను సమర్పించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ తాగునీటికి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా సూచనలు ఇవ్వనుంది. గతవారం ఎల్ నినో పరిస్థితులపై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యసర సమావేశం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోవిడ్-19 తరహా పరిస్థితులు ఎదుర్కొనక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్టోబరు 15న జరగాల్సిన అఖిలపక్షం చివరి నిమిషంలో వాయిదా వేశారు.

ఇక, ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది కరువు పరిస్థితులు నెలకున్నాయి. రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది. దీంతో వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అలాగే, పట్టణాల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నీటి పొదుపు, భూగర్భ జలాల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. రాజధాని హైదరాబాద్‌ విషయంలో ప్రతీ ఫ్యామిలీ నీటి వినియోగాన్ని 20 శాతం మేర తగ్గించుకోవాలని ప్రభుత్వం సూచించింది. తాగునీటిని వృథా చేయవద్దని, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు తెలిపింది.