Mahaa Daily Exclusive

  బతుకమ్మ వేడుకల్లో కానిస్టేబుల్‌ వీరంగం!

Share

  •  మద్యం మత్తులో వచ్చి గ్రామస్తులతో వాగ్వాదం.

యాదాద్రి భువనగిరి, మహా.

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల సందర్భంగా వివాదం చోటుచేసుకుంది. గ్రామంలో మహిళలు, స్థానికులు కలిసి నిర్వహిస్తున్న సంబురాల వద్దకు కానిస్టేబుల్‌ రాజు నాయక్‌ మద్యం మత్తులో వచ్చి హంగామా చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఆయన ప్రవర్తనతో పండుగ వాతావరణం దెబ్బతిన్నదని పేర్కొన్నారు.

గ్రామస్తులతో వాగ్వాదం

బతుకమ్మ వేడుకల కోసం గ్రామస్తులు డీజే ఏర్పాటు చేసుకుని సంబురాలు నిర్వహిస్తున్న సమయంలో కానిస్టేబుల్‌ అక్కడికి వచ్చి జోక్యం చేసుకున్నట్లు సమాచారం. గ్రామస్తులతో వాగ్వాదానికి దిగడంతో పాటు వేడుకలను అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. స్థానిక ప్రజాప్రతినిధులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా పరిస్థితి సద్దుమణగలేదని గ్రామస్తులు పేర్కొన్నారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు సిబ్బందే మద్యం సేవించి పండుగ వేడుకల వద్దకు వచ్చి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే కానిస్టేబుల్‌ రాజు నాయక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసు శాఖ అధికారిక స్పందన తెలియాల్సి ఉంది.