Mahaa Daily Exclusive

  గ్యాస్‌ గోడౌన్‌ మేనేజర్‌ ఆత్మహత్య.

Share

  •  మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో విచారణ.
  •  భద్రాచలంలో విషాదం

భద్రాచలం, మహా:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పౌరసరఫరాల శాఖ పరిధిలోని గ్యాస్‌ గోడౌన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న అనంతుల లక్ష్మీనారాయణ (57) ఆత్మహత్యకు పాల్పడ్డారు. భద్రాచలంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఆయన మృతిచెందారు. తన మరణానికి పలువురు కారణమంటూ సూసైడ్‌ నోట్‌లో రాసారు.

లక్ష్మీనారాయణ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్‌ అంతర్గత కమిటీ ద్వారా విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ తన కార్యాలయ వాట్సాప్‌ గ్రూపులో మరణ వాంగ్మూలంగా పేర్కొన్న సందేశాన్ని పంపించి, భద్రాచలంలోని లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

మహిళా ఉద్యోగి గ్యాస్‌ వినియోగదారుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేయడాన్ని తాను అడ్డుకున్నానని, అందుకే తనపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిందని లక్ష్మీనారాయణ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. “మీరు డబ్బు తీసుకోరు.. మమ్మల్ని తీసుకోనివ్వరు” అంటూ ఆమె తనను ప్రశ్నించేదని అందులో రాసినట్లు తెలుస్తోంది.మహిళా ఉద్యోగితో పాటు ఆమె భర్త నాయిని రాజేష్‌, 10టీవీ రిపోర్టర్‌ నాగ చందు, బిగ్‌ టీవీ రిపోర్టర్‌ వెంకన్న, టీవీ9 రిపోర్టర్‌ రవి తనను వేధిస్తున్నారని లక్ష్మీనారాయణ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

సహోద్యోగుల సమాచారం మేరకు పోలీసులు లాడ్జికి చేరుకునే సమయానికి లక్ష్మీనారాయణ మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, సూసైడ్‌ నోట్‌, కార్యాలయ వాట్సాప్‌ గ్రూపులో పంపిన సందేశం, మహిళా ఉద్యోగి చేసిన ఫిర్యాదు తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. మహిళా ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలు, లక్ష్మీనారాయణపై నమోదైన ఫిర్యాదులోని అంశాలపై విచారణ అనంతరం వాస్తవాలు వెల్లడికానున్నాయి.