• ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు ఆగవు.
• మంత్రి పొంగులేటి
ఖమ్మం, మహా:
రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ పథకాల అమలును ప్రభుత్వం నిలిపివేయదని తెలిపారు. సోమవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో హామీలతో ప్రజలను మోసం చేసిన గత ప్రభుత్వాలకు భిన్నంగా, అర్హులైన పేదలెవరూ నష్టపోకుండా సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ పారదర్శకంగా ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్లో మరో లక్ష ఇళ్లను మంజూరు చేయడంతోపాటు ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, తండాల్లోనూ విడతల వారీగా ఇళ్లను అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.30 లక్షల నుంచి 2.40 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. అవసరమైన మేరకు నిధులు ఖర్చు చేసి, మూడో, నాలుగో విడతల్లోనూ అర్హులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
నిరుద్యోగ యువతకు ఇప్పటికే 73 వేల ఉద్యోగాలు కల్పించామని, మరో 14 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు. త్వరలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత 33 నెలల్లో మహిళా సంఘాలకు రూ.73 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించినట్లు పేర్కొన్నారు.








