Mahaa Daily Exclusive

  నకిలీ నంబర్‌ ప్లేట్లపై ట్రాఫిక్‌ పోలీసుల ఉక్కుపాదం.

Share

• నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

హైదరాబాద్‌, మహా:

నకిలీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా గత 8 నెలల్లో నకిలీ నంబర్‌ ప్లేట్లకు సంబంధించి 100 క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, 100 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 88 ద్విచక్ర వాహనాలు, 12 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. ట్రాఫిక్‌ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు నకిలీ రిజిస్ట్రేషన్‌ నంబర్లను ఉపయోగిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లు స్పష్టంగా కనిపించకుండా చేయడం, నకిలీ నంబర్లను ఉపయోగించడం, అక్షరాలు, అంకెల ఆకృతులను ఇష్టానుసారంగా మార్చడం వంటి ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అనధికారిక ఫాంట్లు, అలంకార అక్షరాలు, స్టిక్కర్లు ఉపయోగించడం లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కనిపించకుండా మార్పులు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.

మోటారు వాహనాల చట్టం, 1988, కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు, 1989 ప్రకారం వాహనదారులు తమ వాహనాలకు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్‌ ప్లేట్లను అమర్చుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్లకు సంబంధించిన ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను పాటించాలని తెలిపారు. నంబర్‌ ప్లేట్లు అసలైనవిగా ఉండటంతోపాటు, స్పష్టంగా కనిపించేలా, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు.

నకిలీ నంబర్‌ ప్లేట్ల వినియోగం వల్ల ట్రాఫిక్‌ ఉల్లంఘనలను గుర్తించడం, చలాన్లను సంబంధిత వాహనదారులకు జారీ చేయడం వంటి ప్రక్రియలకు ఆటంకం కలుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా నంబర్‌ ప్లేట్లను మార్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నకిలీ రిజిస్ట్రేషన్‌ నంబర్ల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. નિયમాలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.