• వార్డుల వారీగా ప్రచారానికి సిద్ధం.
• 100 శాతం విజయమే లక్ష్యం.
• ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ, మహా:
విజయవాడలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎంపీ కేశినేని చిన్ని, వంగవీటి రాధాకృష్ణ, బుద్దా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రణాళిక, వార్డుల వారీగా ప్రచారం, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణను ప్రకటించడం కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. రాధా సుమారు రెండు లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో వార్డుల వారీగా పర్యటించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. అన్ని స్థానాల్లో విజయం సాధించేలా సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.
కూటమిలో ఎక్కడా తిరుగుబాటు అభ్యర్థుల సమస్య తలెత్తదని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. టికెట్లు ఆశించి దక్కని నాయకులతో మాట్లాడి సమన్వయం చేసుకుంటామని తెలిపారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
కూటమి నేతల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, అందరూ ఒకే బృందంగా పనిచేస్తున్నారని వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు సాగుతామని, ప్రజలు కూటమికి మద్దతు ఇస్తారనే నమ్మకం ఉందని తెలిపారు.
టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా ప్రజలతో సంబంధాలు కలిగిన నాయకుడిగా వంగవీటి రాధాకు గుర్తింపు ఉందన్నారు. విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో రాధా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త ఆయన విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు, వార్డుల వారీగా నాయకుల బాధ్యతలు, కూటమి అభ్యర్థుల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించినట్లు నేతలు తెలిపారు.








