- మంత్రి ఉత్తమ్‌ను కలిసిన ఉమ్మడి జిల్లా నేతలు!
- ఏదుల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని విజ్ఞప్తి.
- జూబ్లీహిల్స్‌లోని నివాసంలో గంటన్నర పాటు సాగిన కీలక భేటీ
హైదరాబాద్ , మహా.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని ఏదుల నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రతిపాదనపై ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల్లో వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏదుల నుంచి డిండికి నీటి తరలింపును ఆపాలని, పాలమూరు ప్రాంత రైతాజ్యానికి ఎటువంటి నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కోరుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని మంత్రి ఉత్తమ్ నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు కొనసాగడం ప్రాధాన్యత సంతరించుకుంది..
గంటన్నర పాటు సాగిన విస్తృత చర్చలు..
గత కొంతకాలంగా డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపు అంశం పాలమూరు జిల్లా రాజకీయ వర్గాల్లో, రైతాబ్దంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఆ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో కలిసి పరిస్థితిని వివరించారు. డిండి నీటి తరలింపుతో పాటు పాలమూరు జిల్లాలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు.
ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించండి..
ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. ఏదుల రిజర్వాయర్ నుంచి నేరుగా డిండికి నీటిని తరలిస్తే ఎగువ ప్రాంతాలైన పాలమూరు ఆయకట్టుకు భవిష్యత్తులో సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము డిండి ప్రాజెక్టుకు నీరు ఇవ్వడాన్ని వ్యతిరేಕించడం లేదని, అయితే పాలమూరు రైతులకు అన్యాయం జరగకుండా ఏదుల కాకుండా మరో ప్రత్యామ్నాయ నీటి వనరు లేదా మార్గం ద్వారా డిండికి నీటిని తరలించే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం వల్ల స్థానిక ఆయకట్టుపై పడే ప్రభావాన్ని మంత్రికి పూసగుచ్చినట్లు వివరించారు.
అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం: మంత్రి ఉత్తమ్
పాలమూరు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా విన్నారు. ఈ అంశంపై త్వరలోనే నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు, నల్గొండ జిల్లాల రైతులకు ఎటువంటి నష్టం, ఇబ్బందులు కలగకుండా, ఇరు ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన సమగ్ర నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.
మంత్రి ఉత్తమ్‌పై పూర్తి నమ్మకం ఉంది: జూపల్లి కృష్ణారావు.
సమావేశం అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పురోగతిపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. పాలమూరు ప్రాంత రైతుల ప్రయోజనాలకు మంత్రి ఉత్తమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలిగించరని, ఆయనపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మిగతా సాగునీటి ప్రాజెక్టుల పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు జూపల్లి వెల్లడించారు.








