Mahaa Daily Exclusive

  వేగంగా మారుతున్న నేరాల స్వరూపం

Share

  • రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం
  • మా పోలీసులకు జాతీయ స్తాయి గుర్తింపు వచ్చింది
  • దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
  • కలిసికట్టుగా పని చేసి దక్షిణ భారత్ కు గుర్తింపు తేవాలన్న సీఎం

హైదరాబాద్, మహా : పోలీసుశాఖలో అనేక సంస్కరణలు తెచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు, దర్యాప్తు సంస్థల సమన్వయ సమావేశానికి హాజరైన రేవంత్రెడ్డి, రాష్ట్రంలో చేపట్టిన చర్యలను వివరించారు. మంచి సమాజం కోసం పోలీసుశాఖలో సంస్కరణలు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. హైడ్రా, ఈగల్‌, టీజీ సేఫ్‌ ఏర్పాటు చేశామని, నార్కోటిక్స్ నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రాన్ని నక్సల్స్ ఫ్రీ తెలంగాణగా మార్చామన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కేంద్ర హోంశాఖ అవార్డులు ఇచ్చిందని గుర్తు చేశారు. సమాజానికి భద్రతే పునాది అని, సమర్థవంతమైన, నైతిక విలువలతో కూడిన పోలీసింగ్‌ను ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. నేరాల స్వరూపం వేగంగా మారుతున్న ప్రస్తుత కాలంలో నిరంతర సంస్కరణలు అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సదస్సు హైదరాబాద్‌లో జరగడం తెలంగాణకు గర్వకారణమని, రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక విభాగాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు, దక్షిణాది రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు, వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతినిధులకు ఆయన స్వాగతం పలికారు.

పోలీసు వ్యవస్థకు కేటాయించే నిధులను ఖర్చుగా కాకుండా సురక్షిత సమాజ నిర్మాణం కోసం చేసే పెట్టుబడిగా తాము భావిస్తున్నామని సీఎం తెలిపారు. పాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్ పోలీసు వ్యవస్థను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే 3 కమిషనరేట్లుగా విభజించామని, దీనివల్ల పరిమిత ప్రాంతాలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించే వీలు కలిగిందన్నారు. అలాగే సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ, మహిళల భద్రత కోసం, ఈగల్, టీ సేఫ్ వంటి ప్రత్యేక విభాగాలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ నిర్వహణలో వివిధ విభాగాలు పనిచేస్తున్నాయన్న సీఎం రేవంత్రెడ్డి, ప్రాణాలను పణంగా పెట్టి మరీ శాంతిభద్రతలను పోలీసులు రక్షిస్తున్నారని ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటున్నామని, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. తాము తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలు మరింత సమన్వయంతో పనిచేసి నేరాలను మరింతగా అరికట్టాలని కోరారు. సురక్షితమైన దక్షిణ భారతం కోసం మనమంతా కలిసి పనిచేయాలన్నారు.

పౌరుల భద్రత కోసం పోలీస్శాఖపై ఖర్చు

ఈ సదస్సు ద్వారా పోలీసు విభాగాల మెరుగైన సమన్వయానికి అవకాశం లభిస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల పరస్పర సహకారంతో నేరాలు పూర్తిగా అరికట్టడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. హైదరాబాద్‌ను 4 కమిషనరేట్లుగా విభజించి అత్యుత్తమ సేవలు అందిస్తున్నామన్నారు. నార్కోటిక్స్, సైబర్ నేరాల కట్టడికి కఠిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్న సీఎం రేవంత్‌రెడ్డి.. సమాజానికి భద్రత, రక్షణ అనేవి పునాదులు వంటివన్నారు. సమర్థ, నిష్పక్షపాత పోలీసు వ్యవస్థనే ప్రజలు కోరుకుంటారని తెలిపారు. పోలీసింగ్ విధానాలు మారాలి, సంస్కరణలు నిరంతరం కొనసాగాలని అభిలషించారు. పోలీసుశాఖపై పెట్టే ఖర్చును పౌరుల భద్రతకు పెట్టుబడిగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అప్పుడు ఆక్టోపస్ ఇప్పుడు ఈగల్ ఫోర్స్

నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు 1980ల్లో గ్రేహౌండ్స్ ఏర్పాటు చేశారని, మన విభాగానికి దేశవ్యాప్తంగా మంచి పేరుందని సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరిగాయన్నారు. ఇలాంటి తీవ్రవాద కార్యకలాపాలు అరికట్టేందుకు ఆక్టోపస్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మత్తుపదార్థాల నియంత్రణ కోసం ఇప్పుడు ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్న ఆయన డ్రగ్స్ ముఠాలను పట్టుకునేందుకు అనేక ఆపరేషన్లు చేశామన్నారు. ఇటీవల జీరో నక్సల్ స్టేట్‌గా తెలంగాణ మారిందని డీజీపీ ఆనంద్‌ తెలిపారు. 824 మంది నక్సల్స్ లొంగిపోయారని, 302 ఆయుధాలు అప్పగించారన్నారు.

గంజాయి రవాణాపై దృష్టి

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రకృతి విపత్తుల్లో సమర్థంగా సేవలు అందిస్తున్నామని డీజీపీ ఆనంద్ చెప్పారు. పోలీసులు ఉపయోగించే యాప్స్‌ను టీస్పార్క్‌ పేరుతో అప్‌డేట్‌ చేశామని వెల్లడించారు. మహిళల భద్రతకు ప్రత్యేక విభాగం పనిచేస్తోందన్న డీజీపీ వారి భద్రత కోసం టీసేఫ్‌ యాప్ రూపొందించామని తెలిపారు. రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు బాగా తగ్గాయని తెలిపారు. నేరాలు తగ్గుముఖం పట్టేలా వివిధ రకాల చర్యలు తీసుకున్నామన్నారు. 2023లో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు చేశామని, దీంతో ఎప్పటికప్పుడు మాదక ద్రవ్యాల ముఠాలను పట్టుకుంటున్నామన్నారు. విదేశాలకు వెళ్లి మరీ డ్రగ్స్‌ ముఠాలను సైతం అరెస్టు చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. ప్రస్తుతం గంజాయి రవాణా పెరుగుతోందని దానిపై దృష్టి పెట్టినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.