- కాంగ్రెస్ నిరంకుశ పోకడలపై క్షేత్రస్థాయిలో పోరాడాలని పిలుపు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపు రాజు రామచంద్రరావు.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారపు రాజు రామచంద్రరావు పిలుపునిచ్చారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 జిల్లాల ముఖ్య నాయకులు, రాష్ట్ర పదాధికారుల అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపు రాజు రామచంద్రరావు మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని శ్రేణులను ఆదేశించారు. బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను సమాయత్తం చేసి, పట్టభద్రుల సమస్యలపై గళమెత్తుతూ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని సూచించారు. ప్రతీ కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేసి ఎన్నికల్లో అఖండ విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
అలాగే, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘లోక్తంత్ర బచావో – భీడ్తంత్ర హఠావో’ ఉద్యమంపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ పోకడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలను మరింత ఉధృతం చేయాలని నారపు రాజు రామచంద్రరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గట్టిగా నిలదీయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.ఈ భేటీలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, సహ ఇన్ఛార్జులు అభయ్ పాటిల్, రేఖా శర్మ, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఎన్. మధుకర్ జి, సంయుక్త ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.








