శత్రువులకు ఏదీ మనకు దూరం కాదు.
* ఆపరేషన్ సిందూర్’తో భారత్ సత్తా చాటామ్ .
* ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్ హెచ్చరిక!
న్యూఢిల్లీ, మహా.
భారత వైమానిక దళం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దేశ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పిందని, శత్రువులు ఐఏఎఫ్ దళాల నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని వైమానిక దళాధిపతి (ఎయిర్ చీఫ్ మార్షల్) ఏపీ సింగ్ స్పష్టం చేశారు. ఓ జాతీయ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయన పాకిస్థాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా శత్రువులకు స్పష్టమైన సందేశం పంపామని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సుమారు 1,200 కిలోమీటర్ల వెడల్పు, 200 కిలోమీటర్ల పరిధిలోని కీలక లక్ష్యాలపై వైమానిక దళం అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించిందని వెల్లడించారు.
భవిష్యత్తు సామర్థ్యాల పెంపుపై దృష్టి:
ఈ చారిత్రాత్మక విజయాన్ని చూసి ప్రస్తుత సామర్థ్యాలతోనే ఆగిపోరాదని, భవిష్యత్తులో మరింత పటిష్టంగా వైమానిక దళ సన్నాహాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సింగ్ నొక్కిచెప్పారు. ప్రత్యర్థి వ్యూహాలు మారుతున్న కొద్దీ వేగంగా స్పందించేందుకు వివిధ ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచుకోవడం అత్యంత కీలకమన్నారు. ఒకే ఆయుధం లేదా ఒకే వ్యవస్థపై పూర్తిగా ఆధారపడకుండా, అనేక రకాల సామర్థ్యాలను వినియోగించుకోగల దళంగా ఎదగాలని తెలిపారు. సరైన సమయంలో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నియంత్రించగలిగామని చెప్పారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం – పౌరులకు రక్షణ:
గతేడాది మే నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి దీటైన బదులిచ్చేలా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలతో పాటు, పాక్ ఆక్రమిత ప్రాంతాలు, శత్రు భూభాగంలోని కీలక లక్ష్యాలపై శక్తివంతమైన దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా తాము ఎంచుకున్న వ్యూహం నూటికి నూరుపాటూ సరైనదేనని నిరూపించామని ఏపీ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని, దేశం మరోసారి బాధ్యత అప్పగిస్తే మరింత వేగంగా, కచ్చితత్వంతో దళాలను సిద్ధం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
స్వదేశీ పరిజ్ఞానమే శ్రీరామరక్ష:
ఈ ఆపరేషన్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అనేక ఆయుధ వ్యవస్థలు అసాధారణ పనితీరు కనబరిచాయని ఎయిర్ చీఫ్ మార్షల్ వెల్లడించారు. శత్రు భూభాగంలో లోతుగా ఉన్న లక్ష్యాలపై తీవ్ర ప్రభావం చూపేలా దాడులు చేశామని చెప్పారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో పౌరుల ఆస్తులకు, ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించామన్నారు. కేవలం ఒకే ఆయుధం లేదా యుద్ధ విమానం వల్లనే ఈ విజయం సాధ్యం కాలేదని, కచ్చితమైన నిఘా సమాచారం (ఇంటెలిజెన్స్), నెట్వర్క్ ఆధారిత ఆపరేషన్లు, శత్రు పరిధికి వెలుపలి నుంచే ప్రయోగించగల ఆయుధాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వంటి అత్యాధునిక సాంకేతికతల సమ్మిళితంతోనే ఆశించిన ఫలితాలు సాధించామని ఆయన వివరించారు.







