Mahaa Daily Exclusive

  కశ్మీర్ మాదే, తోక జాడిస్తే ఖబర్దార్!!

Share

కశ్మీర్ మాదే, తోక జాడిస్తే ఖబర్దార్!!
• ఐరాస సాక్షిగా పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్.
న్యూఢిల్లీ, మహా.

జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అఖండ భాగమని స్పష్టం చేసిన భారత్.. పాక్ అక్రమ ఆధీనంలో ఉన్న భూభాగాలను తక్షణమే ఖాళీ చేయాలని హెచ్చరించింది. ఇతరులకు ఉచిత సలహాలు, పనికిమాలిన నీతులు వల్లించడం కట్టిపెట్టి, ముందు మీ దేశంలోని దిగజారిన వ్యవస్థలను, ప్రజల దయనీయ బతుకులను సరిదిద్దుకోండంటూ వార్నింగ్ ఇచ్చింది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మూడో కమిటీలో మైనారిటీ హక్కులపై జరిగిన చర్చ సందర్భంగా భారత శాశ్వత ప్రతినిధి బృందం పాక్‌ ఆటకట్టించింది. భారత ప్రతినిధి బృందం తరఫున ఫస్ట్ సెక్రటరీ రఘూ పూరి పాకిస్థాన్ ముఖంపై నిప్పులు చెరిగేలా మాట్లాడారు. పాకిస్థాన్ పాలకులకు సైనిక నాయకత్వం ఇచ్చే అరాచకపు ఆదేశాల కంటే, దేశ ప్రజల ఆకలి కేకలు, ప్రాథమిక సమస్యల పరిష్కారమే ముఖ్యమని హితవు పలికారు. ఐరాస వేదికను రాజకీయ మల్టీప్లేయర్‌లా మార్చుకుని ప్రచారాలు చేసుకోవడం పాకిస్థాన్‌కు రోగంగా మారిందని, ఈ చీడ పురుగు బుద్ధులు ఇకనైనా మానుకోవాలని తీవ్రంగా దుయ్యబట్టారు. జమ్ముకశ్మీర్‌ను విడదీయాలని చూస్తే భూమి మీద పాకిస్థాన్ ఉండదనే రీతిలో.. అది భారత్‌లో ఎప్పటికీ విడదీయరాని పవిత్ర భాగమని తేల్చిచెప్పారు.
మైనారిటీల హక్కుల పరిరక్షణ అనేది ఆయా దేశాల సార్వభౌమ బాధ్యత అని స్పష్టం చేసిన భారత్.. మన దేశంలో మత, భాషాపరమైన మైనారిటీలకు భారత రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణలు ప్రపంచానికే రోల్ మోడల్ అని చాటిచెప్పింది. దేశ సమగ్రాభివృద్ధిలో మైనారిటీ వర్గాలు అత్యంత కీలక భాగస్వాములని, ప్రభుత్వంలోని అత్యున్నత పదవులతో పాటు దేశ సర్వోన్నత సంస్థల్లోనూ వారు అగ్రగామిగా సేవలు అందిస్తున్నారని భారత్ సగర్వంగా ప్రకటించింది. ఇదే సమయంలో, అక్టోబర్ 23న కూడా మత స్వేచ్ఛ, అంత్యక్రియల హక్కులు, మైనారిటీల రక్షణ వంటి అంశాలపై పాకిస్థాన్‌కు భారత ప్రతినిధి భవికా మంగళానందన్ గట్టిగా చురకలు అంటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భారత్‌కు పాఠాలు చెప్పే యోగ్యత పాకిస్థాన్‌కు లేదని, ముందు మీ దేశంలోని బలహీన వర్గాల నరకయాతనను చూసుకోమని హెచ్చరించారు.
కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, ప్రపంచాన్ని పీడిస్తున్న వాతావరణ సంక్షోభంపై కూడా భారత్ తన తిరుగులేని వైఖరిని ప్రకటించింది. వాతావరణ న్యాయం, సమానత్వం, సుస్థిర అభివృద్ధికి భారత్ పెద్దపీట వేస్తున్నట్లు భారత ప్రతినిధి బర్ఖా తమ్రాకర్ వెల్లడించారు. మన దేశ రాజ్యాంగం, కఠిన చట్టాలు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, నిబద్ధత కలిగిన స్వతంత్ర న్యాయవ్యవస్థ పర్యావరణ పరిరక్షణకు కవచలా నిలుస్తున్నాయని స్పష్టం చేశారు. పర్యావరణ మార్పుల నుంచి ప్రజలను కాపాడటంలో జీవించే హక్కు, సమానత్వపు హక్కు అత్యున్నతమైనవని మన దేశ సుప్రీంకోర్టు గుర్తించిందని, పర్యావరణ పరిరక్షణలో భారత్ అనుసరిస్తున్న మార్గం ప్రపంచానికే ఆదర్శమని తేల్చిచెప్పింది.