యూట్యూబర్ అమృత్ సింగ్‌పై కేరళ పోలీసుల కేసు.
* ఫోర్ట్ కొచ్చి కేఫ్ వివాదంపై తీవ్ర దుమారం!
తిరువనంతపురం, మహా.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అమృత్ సింగ్ డారెన్‌పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కొచ్చిలోని చారిత్రాత్మక ఫోర్ట్ కొచ్చి ప్రాంతంలోని ఓ ప్రముఖ కేఫ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయనే ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కేరళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఫోర్ట్ కొచ్చిలోని కాశీ ఆర్ట్ కేఫ్ గురించిన వివరాలతో అమృత్ సింగ్ డారెన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ కేఫ్‌లో మహాత్మా గాంధీ చిత్రంతో పాటు పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చిత్రాన్ని ప్రదర్శించడాన్ని ఆయన ఆ వీడియోలో తీవ్రంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, ఆ కేఫ్‌లో గొడ్డు మాంసం వడ్డిస్తున్నారని, ఆ ప్రాంతంలో ముస్లింల ఆధిపత్యం తీవ్రంగా ఉందని, కొన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తంచేయలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు పెద్దఎత్తున విమర్శలకు దారితీసింది. ఆయన వీడియోలోని వ్యాఖ్యలు సమాజంలో మతాల మధ్య అనుమానాలు, విద్వేషాలు పెంచే ప్రమాదం ఉందంటూ వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వివాదంపై కేరళ రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేరళలో మత విద్వేషాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ చోటు లేదని, రాష్ట్రాన్ని ప్రతికూలంగా చిత్రీకరించి సమాజంలోని వర్గాల మధ్య విభజన తెచ్చే ప్రయత్నాలను సహించేది లేదని స్పష్టం చేశారు. సదరు యూట్యూబర్‌పై ఇప్పటికే కేసు నమోదైందని, నిబంధనల ప్రకారం తగిన చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.
మరోవైపు ఈ అంశంపై కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మత సామరస్యం గురించి మాట్లాడటాన్ని స్వాగతిస్తామని, అయితే అన్ని మతాల ప్రజల మనోభావాల విషయంలో ప్రభుత్వం ఒకే విధమైన సున్నితత్వాన్ని ప్రదర్శించాలని హితవు పలికారు. హిందువులు, దేశ అనుకూల భావాలు కలిగినవారి ఆందోళనలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మత సామరస్యం విషయంలో ఎంపిక చేసుకుని స్పందించడం సరికాదని విమర్శించారు. జిన్నాకు సంబంధించిన కళాకృతి ప్రదర్శన, మతపరమైన మనోభావాలు దెబ్బతినడం, హమాస్‌కు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు వంటి పలు అంశాలపై కూడా ప్రభుత్వం అదే స్థాయిలో స్పందించాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.







