Mahaa Daily Exclusive

  అర్నాబ్ తుఫాన్ ముప్పును సమర్థంగా ఎదుర్కొందాం…

Share

అర్నాబ్ తుఫాన్ ముప్పును సమర్థంగా ఎదుర్కొందాం.
* అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.
* సీఎం చంద్రబాబు.
అమరావతి, మహా.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నాబ్’ తుఫాన్‌గా బలపడి రాష్ట్రానికి పెనుముప్పుగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన తుఫాన్ ప్రభావం, ముందస్తు సన్నద్ధతపై సీఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికలతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో సహాయక చర్యల కోసం ఇప్పటికే 10 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. అక్టోబరు 28వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం లోగా బాపట్ల – విశాఖపట్నం మధ్య లేదంటే కోనసీమ – యానాం – కాకినాడ తీర ప్రాంతాల మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 850 కిలోమీటర్లు, కాకినాడకు 930 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
వాతావరణ పరిస్థితుల తీవ్రతను బట్టి అక్టోబరు 26వ తేదీ ఉదయానికి ఇది తుఫాన్‌గా, అదే రోజు రాత్రికి తీవ్ర తుఫాన్‌గా, 27 నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, కొన్ని సందర్భాల్లో ఏకంగా 140 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. అక్టోబరు 27వ తేదీ ఉదయం నుంచే తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరుగుతుందని, ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ముఖ్యంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా సగటున 292.55 మి.మీ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 281.17 మి.మీ, విశాఖపట్నంలో 253.87 మి.మీ, శ్రీకాకుళంలో 249.18 మి.మీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో సగటున 22 నుంచి 29 సెంటీమీటర్ల మేర వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో వచ్చే వరద నీటిని రిజర్వాయర్లలో నిల్వ చేసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సముద్రం అత్యంత అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.