Mahaa Daily Exclusive

  రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం…

Share

  • రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం
  • పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
  • కాన్వాయ్‌లోని కార్లు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం
  • క్షేమంగా బయటపడ్డ రాహుల్ గాంధీ

 

లక్నో, మహా : ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. సుల్తాన్‌పూర్ జిల్లా ప్రత్యేక కోర్టులో పరువు నష్టం కేసుకు సంబంధించి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ లక్నో నుంచి రోడ్డు మార్గాన బయలుదేరారు. మార్గమధ్యంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కాన్వాయ్ వెళ్తుండగా, వెనుక వస్తున్న కార్లు ఒక్కసారిగా అదుపుతప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో తీవ్ర కలకలం రేగింది.

 

రాహుల్ గాంధీ క్షేమం

 

ఈ ప్రమాదంలో రాహుల్ కాన్వాయ్‌లోని పలు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ప్రధాన వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని మిగతా వాహనాల్లో ఉన్న భద్రతా సిబ్బందితో పాటు కొంతమంది కాంగ్రెస్ నేతలకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం రాహుల్ గాంధీ కాన్వాయ్ సుల్తాన్‌పూర్ కోర్టు దిశగా ప్రయాణాన్ని కొనసాగించినట్లు పార్టీ నేతలు తెలిపారు.

 

రాహుల్ కు ఊరట- పరువునష్టం కేసును కొట్టివేసిన కోర్టు

 

పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాహుల్‌పై కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన ఉత్తర్ప్రదేశ్ సుల్తాన్‌పుర్‌ ప్రత్యేక కోర్టు సోమవారం ఆ కేసును కొట్టవేసింది. ఆ కేసు 2018లో కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించినది. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్‌ షాపై రాహుల్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని రాహుల్‌ వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పటి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్‌ మిశ్రా కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో స్థానిక జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగానూ పనిచేసిన ఆయన, రాహుల్‌ గాంధీపై పరువు నష్టం ఫిర్యాదు దాఖలు చేశారు.