- హైదరాబాద్‌లో విషాదం
- ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్, మహా : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. తనను వివాహం చేసుకోకపోతే ఇప్పుడే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోతానంటూ ప్రియుడికి వీడియో కాల్ ద్వారా బెదిరించిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నిజంగానే సూసైడ్ చేసుకుని ప్రాణాలు విడిచింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్చనాచౌదరి మాలిక్ (29) మాదాపూర్ చందానాయక్ తండాలోని ఎస్ఆర్ రెసిడెన్సీలో నివాసం ఉంటోంది. నగరంలోని ఒక ప్రైవేటు సంస్థలో సీనియర్ అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తోంది.
నాలుగేళ్ల ప్రేమాయణం.. పెళ్లి కోసం ఒత్తిడి
బొల్లారం ప్రాంతంలో నివసిస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన సహోద్యోగి భండారి విమల్‌తో అర్చనకు గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. విమల్‌కు ఇప్పటికే వివాహమైనప్పటికీ అర్చనను ప్రేమించాడు. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలంటూ అర్చన అతడిపై ఒత్తిడి తెస్తోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2.30 గంటలకు విమల్ తన తల్లితో కలిసి సిద్దిపేట జిల్లా చేర్యాలకు ఒక ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు కారులో వెళ్తుండగా అర్చన నుంచి వీడియో కాల్ వచ్చింది.
వీడియో కాల్లో చున్నీ చూపిస్తూ బెదిరింపు
ఫోన్ ఎత్తగానే తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు కట్టిన చున్నీని చూపిస్తూ, తనను వెంటనే పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన అర్చన కాల్ కట్ చేసింది. దీంతో తీవ్ర కంగారుకు గురైన విమల్ వెంటనే ఆమెకు పలుమార్లు తిరిగి ఫోన్ చేసినప్పటికీ అర్చన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆందోళనతో ప్రయాణాన్ని విరమించుకుని ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు మాదాపూర్‌లోని అర్చన నివాసానికి చేరుకున్నాడు. అర్చన తలుపులు తీయకపోవడంతో విమల్ వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు అక్కడికి స్థలానికి చేరుకుని, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి అర్చనాచౌదరి ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెంది కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అర్చనతో ఉన్న రిలేషన్ కారణంగా విమల్ తన భార్యతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే తనను పెళ్లి చేసుకోవడం లేదని మనస్తాపంలో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు.








