Mahaa Daily Exclusive

  హైడ్రామా..! ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్..

Share

  • గచ్చిబౌలి ఠాణాలో పదిగంటలు హరీష్ నిర్బంధం
  • స్టేషన్ ముందు ఎమ్మెల్యేలు పల్లా, బిఆర్ఎస్ నేతలపై తదితరులపై లాఠీఛార్జి
  • హరీష్, కౌశిక్ లకు కవిత, సబిత, సునితతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరామర్శ
  • బంజారాహిల్స్ పిఎస్ ముందు ఎర్రబెల్లి ఆందోళన
  • ఉదయం నుండి సాయంత్రం దాకా.. అటు గచ్చిబౌలి… ఇటు బంజారాహిల్స్ ఠాణాల వద్ద ఉద్రిక్తత
  • ఎఫ్ ఐ ఆర్ లు గాంధీభవన్ నుండే- హరీష్ సంచలన ఆరోపణలు

 

హైదరాబాద్, మహా

 

ఉదయం నుండి సాయంత్రం దాకా ఓ వైపు గచ్చిబౌలి ఠాణా, మరోవైపు బంజారాహిల్స్ ఠాణాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ నుంచి రాత్రి 8గంటల ప్రాంతంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు విడదలయ్యారు. సీఐని బెదిరించిన కేసులో హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో హరీశ్ రావు ఆయన ఇంటికి వెళ్లగా.. అదే సమయంలో పోలీసులు హరీశ్‌రావును అదుపులో గచ్చిబౌలి స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వెళ్ళిన జగదీష్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పదిగంటల నిర్బంధం అనంతరం హరీశ్‌ రావు స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముందు ఉదయం నుండి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హరీష్ రావు ను విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు ఆంధోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డిలను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల అరెస్టుపై ఎమ్మెల్సీ కవిత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా పాలన కాదని.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అంటూ మండిపడ్డారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని.. వాళ్లని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. కాగా హరీష్ రావు, కౌశిక్ లను మాజీమంత్రులు సబిత, సునితతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరామర్శించారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ని విడుదల చేయాలంటూ మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నా నిర్వహించారు.

 

 

కౌశిక్ రెడ్డిని విడుదల చేసే వరకూ బీఆర్ఎస్ నిద్రపోదు- హరీష్ రావు ఆగ్రహం

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని చూస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లు పోలీస్ స్టేషన్ నుంచి కాదు.. గాంధీ భవన్‌ నుంచి వస్తున్నాయి. కాంగ్రెస్ పగ, ప్రతీకారాలతో పనిచేస్తోంది. పోలీసులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. రాష్ట్రంలో ఏడో గ్యారంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు. ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం. కేసీఆర్ కట్టిన నిర్మాణాలను మీరు ప్రారంభిస్తున్నారు. ఏడాది పాలనలో ఒక్క పాలసీ అయినా చేశారా ?. రేవంత్ సీఎంగా పనిచేయట్లేదు. గల్లినాయకుడిగా పనిచేస్తున్నారు. రేవంత్ తెచ్చిన మార్పు అంటే ఇదేనా ?. చట్టాలు, రాజ్యాంగం శాశ్వతం.. సీఎం శాశ్వతం కాదు. ఏడాది పాలనలో మహిళలకు లక్ష కోట్ల రుణమన్నారు. అదంతా బోగస్. వరంగల్ డిక్లరేషన్ 9 హామీల్లో ఒకటి కూడా అమలు కాలేదు. మేం వాటినే అమలు చేయమని సలహా ఇచ్చాం కదా. మూడుసార్లు రైతుబంధు ఇవ్వమని అడిగాం కదా. అవ్వా తాతలకు 4 వేల పింఛన్ ఎపుడిస్తారని అడిగాం కదా. 7 నెలల నుంచి పోలీసులకు టీఏలు ఇవ్వడం లేదు. రైతులకు మద్దతు ధర లేదు, బోనస్ బోగస్ అయ్యింది. రైతు రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టారు. రైతుబంధు ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలను, మహిళలను అరెస్టు చేశారు. వీళ్లందరినీ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా విడుల చేయాలి. కౌశిక్ రెడ్డిని విడుదల చేసే వరకూ బీఆర్ఎస్ నిద్రపోదు, ఆయనకు అండగా ఉంటుందని” హరీశ్‌ రావు అన్నారు.

 

బంజారాహిల్స్ పీఎస్ ఎదుట ఎర్రబెల్లి ఆందోళన

 

హైదరాబాద్, మహా: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, హరీశ్ రావులను కలిసేందుకు ఆయన పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పీఎస్ ముందు భైఠాయించారు. అనంతరం మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే కోర్టులో హాజరుపరచాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఆయనతోపాటు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మణ్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.