Mahaa Daily Exclusive

  ప్రోబా-3 మిషన్ సక్సెస్..

Share

  • – నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ59

మహా

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రోబా-3 ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రోబా-3 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రోబా-3 మిషన్లో భాగంగా సుమారు 550 కిలోల బరువున్న రెండు ఉపగ్రహాలను పిఎస్ ఎల్వీ సి-59 వాహకనౌక మోసుకెళ్లింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్ ప్రకటించారు. ఈ మేరకు ప్రయోగం విజయవంతంపై శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ ప్రయోగం కృత్రిమ సూర్యగ్రహణం కోసం ..

 

సూర్యుడి బయటి పొర అయిన కరోనాను అధ్యయనం చేసేందుకు ‘పీఎస్‌ఎల్‌వీ-సీ59/ప్రోబా-3’ మిషన్ను చేపట్టారు. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. ఈ మిషన్లో.. కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ , ఓకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ అనే రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటిని ‘స్టాక్డ్ కాన్ఫిగరేషన్’లో అంటే ఒకదానిపై మరొకటి అమర్చి రెండింటినీ కలిపి ఒకేసారి లాంఛ్ చేశారు. ఈ రెండు శాటిలైట్లను ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించారు. ‘ప్రోబా-3’ మిషన్లో భాగంగా ఎక్స్ ఎల్ రాకెట్ రెండు ఉపగ్రహాలను సరైన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం ఈ రెండు శాటిలైట్లు పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో సూర్యుని చుట్టూ భూకక్ష్యలో తిరగనున్నాయి. సాధారణంగా సూర్యుని ప్రచండ వెలుగుల మధ్య కరోనా పొరను గమనించడం చాలా కష్టం. ఎందుకంటే సూర్యుని ప్రకాశం.. కరోనా బ్రైట్ పాయింట్ కంటే మిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది టెలిస్కోప్‌ను బ్లైండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యగ్రహణం కోసం పరిస్థితులను సిద్ధం చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు.