Mahaa Daily Exclusive

  విమాన టికెట్‌ ధరలపై కేంద్రం కీలక అధికారం…

Share

  • విమాన టికెట్‌ ధరలపై కేంద్రం కీలక అధికారం
  • అత్యవసర పరిస్థితుల్లో ఛార్జీల నియంత్రణకు కొత్త నిబంధనలు
  • ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు జారీ చేసే అధికారం కేంద్రం చేతికి

న్యూఢిల్లీ, మహా : విమాన ప్రయాణికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో విమాన టికెట్‌ ధరలను నియంత్రించే అధికారాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన పరిధిలోకి తీసుకుంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సందర్భాల్లో విమానయాన సంస్థలకు టికెట్‌ ఛార్జీల విషయంలో ఆదేశాలు జారీ చేసే వెసులుబాటును కల్పించింది. అయితే ప్రభుత్వం జారీ చేసే ఈ ఆదేశాలు నిర్దిష్ట కాలానికి మాత్రమే వర్తించనున్నాయి.

నిర్వహణ వ్యయాల ఆధారంగా ధరలు

భారతీయ వాయుయాన్‌ అధినియం-2026లోని నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు తమ నిర్వహణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని టికెట్‌ ధరలను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈ ధరలకు సంబంధించిన పూర్తి వివరాలను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)కు సమర్పించడం తప్పనిసరి.

ప్రజా ప్రయోజనాలే ప్రాధాన్యం

నిబంధన 192 ప్రకారం విమానయాన సంస్థలు నిర్ణయించే టారిఫ్‌ వివరాలపై డీజీసీఏకు సమాచారం అందించాలి. అదే సమయంలో అత్యవసర పరిస్థితులు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి విమానయాన సంస్థలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయవచ్చు. అయితే ఈ అధికారాన్ని నిర్దిష్ట కాలపరిమితిలోనే వినియోగించాల్సి ఉంటుంది. తాజా నిబంధనలతో విమాన టికెట్‌ ధరల విషయంలో అత్యవసర సమయాల్లో కేంద్ర ప్రభుత్వానికి మరింత నియంత్రణాధికారం లభించినట్లయింది.