- అమెజాన్‌తో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందం
- లక్షమందికి ఫ్రీగా ఏఐ, క్లౌడ్ ట్రైనింగ్
- 643 టాస్క్ అనుబంధ కళాశాలల విద్యార్థులకు ప్రయోజనం
- విద్యార్థులపై ఆర్థిక భారం లేకుండా అమలు చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, మహా : తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) సహకారంతో లక్ష మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ అందించనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), ఏడబ్ల్యూఎస్ మధ్య సోమవారం సచివాలయంలో కీలక ఒప్పందం కుదిరింది.
ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 643 టాస్క్ అనుబంధ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా టెక్నికల్స్ స్కిల్స్ నేర్పించనున్నారు. ప్రభుత్వానికి, కళాశాలలకు, విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో వేగంగా ప్రాధాన్యం పెరుగుతున్న ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలపై యువతకు అవగాహనతో పాటు ప్రాక్టికల్ అనుభవం కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ వంటి విభాగాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కేవలం క్లాస్ రూం పాఠాలకే పరిమితం కాకుండా.. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కన్సోల్ ద్వారా ప్రాక్టికల్‌గా నేర్చుకునే అవకాశాన్ని కూడా విద్యార్థులకు కల్పిస్తారు. దీనివల్ల విద్యార్థులు రియల్ టైమ్ టెక్నాలజీపై పనిచేసే అనుభవాన్ని పొందవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులకే కాకుండా ఆర్ట్స్, కామర్స్ వంటి నాన్ స్టెమ్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కూడా ప్రత్యేక లెర్నింగ్ ట్రాక్‌లు అందుబాటులో ఉంటాయి. అంటే టెక్నికల్ విద్యను చదవని విద్యార్థులు కూడా.. వారు చదువుకున్న విద్యకు అనుగుణంగా ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలపై నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ ట్రైనింగ్ తీసుకునే విద్యార్థులకు ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ ద్వారా ఏడాది పాటు 900కు పైగా డిజిటల్ కోర్సులను ఫ్రీగా అందించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు డిస్కౌంట్ వోచర్లను కూడా ఇవ్వనున్నారు. అలాగే సాంకేతిక రంగ నిపుణులతో ప్రత్యేకంగా ఇండస్ట్రీ కనెక్ట్ సెషన్లు, హ్యాకథాన్లు నిర్వహించనున్నారు. వీటి ద్వారా పరిశ్రమల అవసరాలు, కొత్త టెక్నాలజీల వినియోగం, సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనే విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. సక్సెస్‌ఫుల్‌గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం టాస్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
విద్యార్థులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే కాలేజీల అధ్యాపకులకు కూడా ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలపై శిక్షణ అందించనున్నారు. తద్వారా కాలేజీల్లో సాంకేతిక విద్యా బోధన సామర్థ్యాన్ని పెంచేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అందించే శిక్షణ మరింత సమర్థంగా కొనసాగేందుకు అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి కూడా దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని లక్ష మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ రంగాల్లో శిక్షణ పొందే అవకాశం లభించనుంది. ముఖ్యంగా సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదువుతున్నవారికి కూడా కొత్త సాంకేతిక రంగాల్లోకి అడుగుపెట్టేందుకు ఇది ఒక అవకాశంగా నిలవనుంది.








