Mahaa Daily Exclusive

  అమిత్ షాతో చిరంజీవి, రామ్‌చరణ్ భేటీ.

Share

  • అమిత్ షాతో చిరంజీవి, రామ్‌చరణ్ భేటీ
  • రాజకీయమా లేక ఆత్మీయ సమావేశమా
  • రాజకీయ వర్గాల్లో జోరందుకున్న చర్చ

హైదరాబాద్, మహా : హైదరాబాద్ పర్యటన సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లు భేటీ అయ్యారు. వీరితో పాటు మై హోం గ్రూప్ అధినేత రామేశ్వరరావుతో పాటు పలువురు కలిశారు. అయితే చిరంజీవి, రాంచరణ్ భేటీ అంశం చర్చనీయాంశంగా మారింది. ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగిన లంచ్ మీటింగ్‌లో మీరు పాల్గొన్నారు. అయితే గతంలోనూ అమిత్ షాను చిరంజీవి, రామ్‌చరణ్ కలిశారు. ఇప్పుడు మరోసారి భేటీ వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సమావేశం వెనుక రాజకీయ వ్యూహం ఉందా లేక.. ఆత్మీయ సమావేశమా అనేది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.

ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీయేనా లేక తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ వ్యూహాలకు సంబంధించి ఏదైనా చర్చ జరగిందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన కలిసి ఎన్డీయే కూటమిలో కొనసాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవి.. ఆయన కుమారుడు రామ్‌చరణ్‌తో అమిత్ షా సమావేశం కానున్నారన్న ప్రచారం రాజకీయంగా తీవ్ర ఆసక్తి కలిగిస్తోంది. ఈ భేటీ వెనుక రాజకీయ చర్చలు ఉన్నాయనే విషయానికి ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేకపోయినా.. ఈ భేటీలో రాజకీయాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ నాయకులు మాత్రం అమిత్ షాతో మెగా ఫ్యామిలీ సమావేశాన్ని మర్యాదపూర్వక భేటీగా అభివర్ణిస్తున్నారు.

ఇక.. గతంలోనూ చిరంజీవి, రామ్‌చరణ్‌ అమిత్ షాను కలిసిన సందర్భాలు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించిన తర్వాత చిరంజీవి, రామ్‌చరణ్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి.. అమిత్ షాను కలిశారు. ఆ సమయంలో భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై అమిత్ షా వారిని అభినందించారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ తన రాజకీయ కార్యక్రమాలను విస్తరిస్తున్న సమయంలో ఈ భేటీ జరగడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తంగా అమిత్ షా హైదరాబాద్ పర్యటన, మెగా కుటుంబంతో భేటీపై వస్తున్న వార్తలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని పెంచాయి. ఇది ఆత్మీయ సమావేశంగానే ముగుస్తుందా లేక భవిష్యత్తులో ఏదైనా రాజకీయ పరిణామానికి దారితీస్తుందా అనేది అధికారిక వివరాలు వెల్లడైన తర్వాతే స్పష్టం కానుంది.

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న షా

హైదరాబాద్ పర్యటనలో భాగంగా అమిత్ షా చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి నేరుగా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అమిత్ షా పాటు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు తదితరులున్నారు.