Mahaa Daily Exclusive

  అకాల వర్షంతో అన్నదాత కంట కన్నీరు.

Share

  • అకాల వర్షంతో అన్నదాత కంట కన్నీరు.
  • ఐకేపీ కేంద్రాల నిర్లక్ష్యంపై రైతుల తీవ్ర ఆగ్రహం.

సిద్దిపేట, మహా.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో అకాల వర్షం రైతన్నల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరుగాలం కష్టపడి, ఎండనకా వాననకా శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామనుకున్న ఆ రైతుల ఆశలు ఒక్కసారిగా కురిసిన వర్షంతో నీళ్లలో కలిసిపోయాయి. గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి రైతులు తమ వరి ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబోశారు. అయితే, రోజుల తరబడి ధాన్యం అక్కడే ఉన్నప్పటికీ అధికారులు కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించలేదు. ఈ లోపు అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. కళ్ల ముందే పంట నీటిపాలవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతూ కన్నీటిపర్యమయ్యారు.
ఈ దుస్థితికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఐకేపీ కేంద్రానికి ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా నిర్వాహకులు పట్టించుకోలేదని ఆరోపించారు. కనీసం కొనుగోలు కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి ఉంటే తమకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని వాపోయారు. ఇప్పటికే వ్యవసాయం కోసం భారీగా పెట్టుబడులు పెట్టామని, అప్పులు తెచ్చి సాగు చేశామని, ఇప్పుడు ధాన్యం తడిసిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి తడిసిన ధాన్యం రంగు మారుతుందని, మొలకలు వస్తే ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు నిరాకరిస్తారనే భయం రైతులను వెంటాడుతోంది.
తమను ఆదుకోవాలని కోరుతూ రైతులు కొన్ని కీలక డిమాండ్లను తెరపైకి తెచ్చారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రాజక్కపేట ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించాలని కోరారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని అధికారులు స్వయంగా పరిశీలించి, ఎలాంటి నిబంధనలు లేదా కోతల పేరుతో ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ మద్దతు ధరతో వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ప్రత్యేకంగా ఆదుకోవాలని, లేదంటే తాము మరింత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.