Mahaa Daily Exclusive

  తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్..

Share

  • తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్
  • మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
  • బ్యారేజ్ నిర్మాణంపై ఉన్నతస్థాయి సమీక్ష
  • ముంపు భూములకు పూర్తి పరిహారం
  • నిధుల కోసం ప్రత్యేక జాయింట్ అకౌంట్

హైదరాబాద్, మహా : తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఇరిగేషన్ శాఖ అధికారులతో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశాన్ని సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. మహారాష్ట్రతో ఇటీవల జరిగిన చర్చల పురోగతిని సమీక్షించిన సీఎం, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

బ్యారేజ్ నిర్మాణం వల్ల మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే భూములకు పూర్తిస్థాయిలో తగిన పరిహారం చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దీనికోసం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అవసరమైన నిధులను ప్రత్యేకంగా ‘జాయింట్ అకౌంట్’లో ఉంచుతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ముంపు ప్రాంతాలు , భూముల వివరాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్వతంత్ర సర్వే చేయించుకున్నప్పటికీ తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తేల్చిచెప్పారు. మహారాష్ట్ర అధికారులకు కావాల్సిన సమస్త సమాచారాన్ని, ఇప్పటివరకు కుదిరిన ఒప్పందాలు , ఇతర పత్రాలను ఎప్పటికప్పుడు వారికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. ముంపునకు సంబంధించిన పూర్తి సమగ్ర వివరాలతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు.