Mahaa Daily Exclusive

  రైతులకు బ్యాంకులు అండగా నిలవాలి….

Share

  • రైతులకు బ్యాంకులు అండగా నిలవాలి
  • ‎ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు బ్యాంకులు ప్రత్యేక చొరవ చూపాలి..
  • ‎కరువును జయించేందుకు రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించాలి‎
  • ‎రైతులకు రుణాల పునర్వ్యవస్థీకరణతో పాటు రబీకి కొత్త రుణాలు అందించాలి‎
  • ‎ఎస్ఎల్‌బీసీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

‎‎
‎హైదరాబాద్, మహా : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు రైతులకు అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. అర్హులైన రైతుల పంట రుణాలను ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పునర్వ్యవస్థీకరించడం, రీషెడ్యూల్ చేయడంతో పాటు రబీ సీజన్‌కు అవసరమైన కొత్త రుణాలను సకాలంలో అందించాలని సూచించారు. రైతులకు రుణాల మంజూరులో జాప్యం చేయకుండా క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు చొరవ చూపాలని స్పష్టం చేశారు.
‎
‎ప్రజాభవన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్‌బీసీ) సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. విద్యా రుణాల మంజూరులో బ్యాంకులు సానుకూలంగా ఉండి అర్హులైన విద్యార్థులకు గరిష్ఠ స్థాయిలో రుణాలు అందించాలని  కోరారు. విద్యా రుణాల మంజూరుపై ఎస్ఎల్‌బీసీ కన్వీనర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. వ్యక్తిగత గృహ నిర్మాణానికి రుణాలు అందించడంలోనూ బ్యాంకులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.  గృహ నిర్మాణ  సంస్థలకు రుణాలివ్వడానికే పరిమితం కాకుండా సామాన్య ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు వ్యక్తిగత గృహ రుణాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), మౌలిక సదుపాయాల రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే ఎంఎస్ఎంఈ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోందని, ఈ రంగానికి రుణాల పెంపు ద్వారా ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి సేవల రంగం వృద్ధికి కీలకమని, ఈ రంగానికి తగిన స్థాయిలో రుణాలు అందించాలని సూచించారు.
‎
‎ఎల్‌నినో ప్రభావం కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో 365 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించామని, వీటిలో 111 మండలాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతుల పెట్టుబడులు, ఆదాయాలు దెబ్బతిన్నాయని, ఈ పరిస్థితుల్లో రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తక్షణ సహకారం అవసరమని పేర్కొన్నారు. విఫలమైన రుతుపవనాల ప్రభావం రైతుకు, బ్యాంకుకు మధ్య ఉన్న సంబంధాన్ని దెబ్బతీయకూడదన్నారు. రైతులకు అందుబాటులో ఉన్న రుణ ఉపశమన చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు సమన్వయంతో పనిచేసి ఆర్బీఐ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. గత రుణాల రీషెడ్యూలింగ్‌తో పాటు అర్హులైన రైతులకు కొత్త పంట రుణాలను సకాలంలో అందించాలని కోరారు. ‎కరవు పరిస్థితుల్లో వ్యవసాయంపై మాత్రమే ఆధారపడకుండా రైతు కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించేందుకు బ్యాంకులు సహకరించాలన్నారు. ఈ సీజన్‌లో కనీసం 10 నుంచి 15 శాతం కుటుంబాలకు అదనపు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నగదు చలామణి పెరిగేలా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, ఇప్పటికే ఉన్న రుణ లక్ష్యాలకు అదనంగా ఒక్కో సంఘానికి మరో రూ.2 లక్షల వరకు రుణాలు అందించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
‎
‎రాష్ట్రంలో అక్టోబర్ 16న విద్యుత్ డిమాండ్ 20,818 మెగావాట్లకు చేరడం చరిత్రలోనే అత్యధికమని  తెలిపారు. వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు, విద్యుత్ వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు రైతుల రుణ చెల్లింపు సామర్థ్యంపైనా ప్రభావం పడుతోందన్నారు. ఈ సంక్షోభాన్ని అన్ని రంగాలూ సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకుల ఆచరణాత్మక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. రైతులు తదుపరి వ్యవసాయ సీజన్‌ను కొత్త ఆత్మవిశ్వాసంతో ప్రారంభించగలగడమే ఈ ప్రయత్నాల విజయానికి కొలమానమని పేర్కొన్నారు.
‎‎
‎రైతాంగాన్ని ఆదుకునేందుకు బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలి: తుమ్మల
‎
‎‎సూపర్ ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలకు భిన్నంగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులకు అండగా నిలవాలని సూచించారు. కరువు ప్రభావిత మండలాల్లో పంట రుణాలను ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వెంటనే రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చరింగ్ చేయాలని, రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా బ్యాంకర్లే ముందుకు రావాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది కృష్ణా, గోదావరి నదులకు వరదలు రాకపోవడంతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. భూగర్భ జలాలు కూడా ఆశించిన స్థాయిలో రీచార్జి కాకపోవడంతో సుమారు 10 నుంచి 15 లక్షల బోరుబావుల్లో నీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఈ ప్రభావం ఖరీఫ్‌తో పాటు రబీ పంటలపైనా పడే అవకాశం ఉన్నందున రైతులను ఆదుకునేందుకు బ్యాంకులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు.
‎
‎గత రెండున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సుమారు రూ.21 వేల కోట్ల పంట రుణమాఫీని అమలు చేసిందని, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించిందని, వ్యవసాయ యాంత్రీకరణ, సాగునీరు, విద్యుత్, సబ్సిడీ తదితర రంగాలతో కలిపి వ్యవసాయంపై రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం తన వంతు బాధ్యతగా రైతులకు అండగా నిలుస్తోందని, బ్యాంకర్లు కూడా అదే స్ఫూర్తితో సహకరించాలని కోరారు. ‎రబీ సీజన్‌కు బ్యాంకులు నిర్దేశించుకున్న రూ.38,268 కోట్ల పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలని సూచించారు. 2026 సెప్టెంబర్ వరకు రూ.96,943 కోట్ల రుణ పంపిణీ లక్ష్యంలో 53 శాతం మాత్రమే సాధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాన్‌సూన్‌ ఫార్మింగ్‌ రుణాల పంపిణీ కూడా లక్ష్యంలో 17 శాతానికే పరిమితమైందని, ఈ పరిస్థితిని అధిగమించి రుణాల మంజూరులో వేగం పెంచాలన్నారు.
‎
‎కరువు ప్రభావిత ప్రాంతాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని, రైతులకు అవసరమైన పెట్టుబడి రుణాలు అందించాలని కోరారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు డ్రిప్, స్ప్రింక్లర్‌ సాగుకు విరివిగా రుణాలు ఇవ్వాలని, వాణిజ్య బ్యాంకులు కూడా వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ‎రాష్ట్రంలో ఇప్పటికే 3.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టామని, ఈ విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు బ్యాంకులు సహకరించాలని మంత్రి కోరారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పశుపోషణ, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించడం ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించవచ్చన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు), మహిళా స్వయం సహాయక సంఘాలకు కూడా రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
‎
‎రైతులు తిరిగి పంటలు సాగు చేసి ఆదాయం పొందే వరకు వడ్డీ భారం పడకుండా ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రుణాల రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చరింగ్ చేపట్టాలని మంత్రి కోరారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను ప్రభుత్వం, బ్యాంకర్లు సమష్టిగా ఎదుర్కొని రైతాంగాన్ని కాపాడుకోవాలని తుమ్మల పిలుపునిచ్చారు.