Mahaa Daily Exclusive

  డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు సీరియస్…

Share

  • డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు సీరియస్
  • వాట్సాప్‌కు కీలక ఆదేశాలు!
  • సూమోటోగా విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం
  • వాట్సాప్ తరఫున కపిల్ సిబల్ వాదనలు

న్యూఢిల్లీ, మహా : దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అమాయక ప్రజలను భయపెట్టి లక్షలాది రూపాయలు కాజేస్తున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు కీలక చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఎలాంటి నివారణ చర్యలు తీసుకోబోతున్నాయో వివరించాలని ఆదేశించింది. అంతేకాదు.. ఇలాంటి మోసాల్లో బాధితులు డబ్బులు కోల్పోతే బ్యాంకులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అనుమానాస్పద లావాదేవీలను ముందుగానే గుర్తించి అడ్డుకోవడం, బాధితులకు పరిహారం అందించడం వంటి అంశాలపై కీలక సూచనలు చేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మహనాతో పాటు విచారణ జరిగింది. డిజిటల్ అరెస్ట్ మోసాలను, సంబంధిత సైబర్ నేరాలను అడ్డుకునేందుకు తాము ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో వాట్సాప్, ఇతర మధ్యవర్తి ఆన్‌లైన్ సంస్థలు కోర్టుకు వివరించాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా తమ ప్రతిపాదనలను కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు కూడా ఒకేసారి సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 23కి వాయిదా వేసింది.

ఇప్పటికే 9,400 ఖాతాలపై చర్యలు..

వాట్సాప్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఇప్పటికే తమ ప్లాట్‌ఫామ్‌లో నివారణ చర్యలు చేపట్టామని, అందులో భాగంగా 9,400 ఖాతాలపై చర్యలు తీసుకున్నామని కోర్టుకు వివరించారు. ఇప్పటివరకు చేపట్టిన చర్యల పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా అనుమానాస్పద ఖాతాలను గుర్తించి, వాటి గురించి వినియోగదారులను ముందుగానే అప్రమత్తం చేసే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ మోసాలను అడ్డుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

డబ్బులు పోతే బ్యాంకులదీ బాధ్యతేనా?

ఈ కేసులో సుప్రీంకోర్టు అత్యంత కీలకంగా ప్రస్తావించిన అంశం బ్యాంకుల బాధ్యత. డిజిటల్ అరెస్ట్ మోసాల్లో ప్రజలు డబ్బులు కోల్పోతే ఆ నష్టానికి బ్యాంకులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మోసం జరిగిందని విచారణలో తేలితే.. బాధితులకు పరిహారం చెల్లించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించే నిబంధనల్లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని పేర్కొంది. బాధితులు కోల్పోయిన మొత్తానికి తగ్గకుండా పరిహారం అందించే నిబంధనలను తీసుకురావాలని సూచించింది. అకౌంట్లలో జరిగే సాధారణ లావాదేవీల సరళి బ్యాంకులకు తెలుసు. అలాంటప్పుడు ఒక వ్యక్తి అకస్మాత్తుగా తన సాధారణ లావాదేవీలకు భిన్నంగా భారీ మొత్తాన్ని బదిలీ చేయడానికి ప్రయత్నిస్తే బ్యాంకులు ఎందుకు జోక్యం చేసుకోలేవని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.

అనుమానాస్పద లావాదేవీలను వెంటనే నిలిపివేయాలి

సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రతి ఆర్థిక సంస్థలో కొన్ని ముందస్తు భద్రతా చర్యలు తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. ఖాతాదారుడి గత లావాదేవీలకు భిన్నంగా అనుమానాస్పదంగా భారీ మొత్తంలో డబ్బు బదిలీ జరిగితే తాత్కాలికంగా ఆ లావాదేవీని నిలిపివేయాలి. ఇలాంటి అనుమానాస్పద లావాదేవీల వివరాలను సమీప పోలీస్ స్టేషన్‌కు ఆటోమేటిక్‌గా తెలియజేయాలి. సంబంధిత లావాదేవీ నిజమైనదేనా కాదా అని నిర్ధారించేందుకు ప్రత్యక్షంగా తనిఖీ చేయాలి. సైబర్ మోసాలను ముందుగానే గుర్తించి, డబ్బులు ఖాతా నుంచి బయటకు వెళ్లకముందే అడ్డుకునే వ్యవస్థ ఉండాలి. ఈ చర్యలను సమర్థంగా అమలు చేసేందుకు దేశంలో అనుమతి పొందిన అన్ని ఆర్థిక సంస్థల జాబితాను తదుపరి విచారణలో సమర్పించాలని ఆర్బీఐని ధర్మాసనం ఆదేశించింది.

సైబర్ నేరాలు తగ్గినా.. రూ.800 కోట్ల నష్టం

సైబర్ నేరాలు గతంతో పోలిస్తే 50 శాతం తగ్గినప్పటికీ.. ఈ ఏడాది ఇప్పటివరకు బాధితులు ఏకంగా రూ.800 కోట్లను కోల్పోయారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఆర్బీఐ రూపొందించనున్న కొత్త నియంత్రణ వ్యవస్థలో మూడు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. మోసాలకు గురైన బాధితులకు పరిహారం అందించడం. అనుమానాస్పద లావాదేవీలను ముందుగానే గుర్తించి అడ్డుకోవడం. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆర్థిక సంస్థలపై బాధ్యతను నిర్ధారించడం. బలహీన వర్గాల ఖాతాదారులకు బ్యాంకులు రక్షణ కవచంలా ఉండాలని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఖాతాదారుల లావాదేవీల చరిత్ర వంటి కీలక సమాచారం బ్యాంకుల వద్ద ఉంటుందని, దానిని ఉపయోగించి మోసాలు జరగకముందే అడ్డుకోవాలని సూచించారు.

ఆర్బీఐ కొత్త కేవైసీ నిబంధనలపై దృష్టి

ఆర్బీఐ ప్రతిపాదించిన కేవైసీ సవరణ మార్గదర్శకాలను ముందుగా పరిశీలించిన తర్వాతే తదుపరి ప్రక్రియకు అనుమతి ఇస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కొత్త మార్గదర్శకాలను నవంబర్ 30 నాటికి నోటిఫై చేసి, డిసెంబర్ 31 నాటికి అమల్లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి కూడా వాదనలు వినిపించారు. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడం, బ్యాంకింగ్ వ్యవస్థలో ముందస్తు భద్రతా చర్యలను బలోపేతం చేయడం కోసం ఇప్పటికే గణనీయమైన కృషి జరుగుతోందని కోర్టుకు వివరించారు.

అన్ని రాష్ట్రాల పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

ఈ కేసులో బ్యాంకులు, ఆన్‌లైన్ సంస్థలతో పాటు పోలీసు వ్యవస్థపైనా సుప్రీంకోర్టు దృష్టి సారించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు విభాగాలు డిజిటల్ అరెస్ట్ మోసాలకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్‌లు, వాటిపై చేపట్టిన దర్యాప్తు వివరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి నేరాలను ఎలా నివారించాలి? నేరగాళ్లను ఎలా గుర్తించాలి? నేరాలకు పాల్పడిన వారిపై విచారణ, ప్రాసిక్యూషన్‌ను ఎలా సమర్థంగా నిర్వహించాలి? అనే అంశాలపై సూచనలు ఇవ్వాలని కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ నివేదికలను కేంద్ర ప్రభుత్వ స్పందనను సమన్వయం చేస్తున్న అంతర్‌శాఖల కమిటీకి సమర్పించాలి. కోర్టుకు అందించే నివేదికల ప్రతులను కూడా ఆ కమిటీకి పంపించాలని ధర్మాసనం ఆదేశించింది.