- ప్లీజ్ వెల్ కమ్ సర్
- భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం
- ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
- రాహుల్ గాంధీని కలిసిన మహేష్ కుమార్ గౌడ్
న్యూఢిల్లీ, మహా : తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతులకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఢిల్లీలోని 10 జన్ పత్ లో రాహుల్ గాంధీతో సమావేశమైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌తో పాటు సర్ వ్యతిరేక సభ, మెగా బీసీ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా రాహుల్‌ను వ్యక్తిగతంగా ఆహ్వానించామని మహేష్ గౌడ్ తెలిపారు. ఇటీవల తెలంగాణ మంత్రులు, ఎంపీల మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు లేదా ఢిల్లీ వేదికగా జరిగిన పరిణామాలపై రాహుల్‌తో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ చేపడుతున్న సంస్థాగత నిర్మాణం, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్వహిస్తున్న విభిన్న కార్యక్రమాల పురోగతిపై కూడా రాహుల్ గాంధీతో సమగ్రంగా చర్చించినట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. నవంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘భారత్ సమ్మిట్’కు రాహుల్ హాజరవుతున్నారని, ఈ సందర్భంగా గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన సూచించారని టీపీసీసీ చీఫ్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ నవంబర్ నెలాఖరు నాటికి పూర్తవుతుందని మహేష్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. సోనియా గాంధీ జీవిత విశేషాలతో వెలువడిన ఆత్మకథ పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ను స్వాగతిస్తున్నామని, ఈ పుస్తకంపై తెలంగాణలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై ఈ భేటీలోనే చర్చించారని ప్రచారం జరుగుతోంది. దాంతో టీపీసీసీ చీఫ్ ఈ ఢిల్లీ పర్యటనతో కొందరు నేతలకు ప్రమోషన్లు దక్కడం, అసంతృప్తులను బుజ్జగించడం ఖాయమని వినిపిస్తోంది.







