- తెలంగాణ జెన్కోకు గుడ్ న్యూస్
- బొగ్గు సరఫరాపై సింగరేణి కీలక నిర్ణయం
- తర్వాతనే ఇతర రాష్ట్రాలకు సరఫరా
- సింగరేణి నుండి రోజుకు 75 వేల టన్నుల బొగ్గు
- నైనీ గనిలో 20వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
హైదరాబాద్, మహా : ఎల్నినో ప్రభావంతో విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సింగరేణి బొగ్గు పరిశ్రమ నుండి తెలంగాణ జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణాను మరింతగా పెంచాలని నిర్ణయించారు. జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సింగరేణి చైర్మన్ బుద్ధ ప్రకాష్ జ్యోతితో పాటు జెన్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరీష్ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ జేన్కోకు బొగ్గు సరఫరాను పెంచాలని కోరారు. ఈ సమావేశం సందర్భంగా ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
బొగ్గు రవాణా విషయాల్లో తెలంగాణ జెన్ కో థర్మల్ కేంద్రాలకు సింగరేణి సంస్థ ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. ఉత్పత్తి చేసిన బొగ్గును ముందుగా జెన్కో విద్యుత్ కేంద్రాలకు రవాణా చేయాలని ఆ తర్వాతనే…ఇతర రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సంస్థ డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లకు సూచించారు. గత మూడు నాలుగేళ్లతో పోల్చి చూసినా సరే ఈ ఏడాది తెలంగాణ జెన్కోకు ఎక్కువ బొగ్గు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరిగితే సింగరేణి తన సామర్థ్యం మేరకు మరింత బొగ్గు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సింగరేణి స్పష్టం చేస్తుంది. ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రోజుకు కనీసం 16 వేల టన్నుల బొగ్గు రవాణా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒడిస్సా నైనీ గనిలో ప్రస్తుతం రోజుకు సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి ని లక్ష్యంగా పెట్టుకోగా…ప్రస్తుతం 3 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉన్నట్లు సింగరేణి యాజమాన్యం పేర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు జెన్ కో లతో సహా స్థానికంగా ఉండే పలు ప్రైవేట్ సంస్థలు కూడా నైనీ బొగ్గు కోసం విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇదిలా ఉండగా నైనీ లో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో మొదటి ప్రాధాన్యంగా తెలంగాణ జెన్ కోకు సరఫరా చేయాలని… మిగిలిన బొగ్గును కూడా ఇతర సంస్థల అవసరాల కోసం రవాణా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.








