- రూ. వెయ్యి పించన్ ఇక రూ. 3 వేలు
- 10 ఏళ్ల తర్వాత ఈపీఎస్ పింఛనులో మార్పు?
- కేంద్రం ముందు కీలక ప్రతిపాదన
న్యూఢిల్లీ, మహా : ఉద్యోగం చేసినన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బుతో పదవీ విరమణ తర్వాత ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పని చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే పింఛనే ప్రధాన ఆదారం. అయితే ప్రస్తుతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్ ) కింద అర్హులైన ఉద్యోగులకు కనీస నెలవారీ పింఛను కేవలం రూ.1,000 మాత్రమే అందుతోంది. నేటి ధరలతో పోలిస్తే ఈ మొత్తం సరిపోవడం లేదని చాలామంది పింఛనుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీస ఈపీఎస్ పింఛనును రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నవంబర్ 19న జరగనున్న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈపీఎస్ కింద అర్హులైన పింఛనుదారులకు నెలకు కనీసం రూ.1,000 పింఛను అందుతోంది. దీనిని రూ.3,000కు పెంచాలనే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే పింఛనుదారులకు నెలకు అదనంగా రూ.2,000 అందుతాయి. అంటే ప్రస్తుతం రూ.1,000 పింఛను పొందుతున్న అర్హులకు నెలకు రూ.3,000 వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది ప్రతిపాదన మాత్రమే. ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన తర్వాతే కొత్త పింఛను మొత్తం అమల్లోకి వస్తుంది.
నవంబర్ 19న కీలక సమావేశం
ఈపీఎస్ పింఛను పెంపుపై ఆశలు పెట్టుకున్న వారికి నవంబర్ 19న జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలో కనీస పింఛను పెంపు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని పలు నివేదికలె వెల్లడించాయి. కార్మిక, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఈపీఎస్ కింద కనీస పింఛను మొత్తాన్ని చివరిసారిగా 2014 సెప్టెంబర్లో రూ.1,000గా నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఈ పదేళ్లకు పైగా కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో నెలకు రూ.1,000తో కనీస అవసరాలు కూడా తీర్చుకోవడం కష్టంగా మారిందని పింఛనుదారులు చెబుతున్నారు. అందుకే అనేక ఉద్యోగ, పింఛనుదారుల సంఘాలు కనీస నెలవారీ పింఛనును రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనికి తోడు డీఏ (కరవు భత్యం) కూడా కల్పించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.3,000కు పెంపు ప్రతిపాదనకు ఆమోదం లభించినా.. పింఛనుదారుల పూర్తి డిమాండ్లు నెరవేరినట్లు కాదని సంఘాలు భావించే అవకాశం ఉంది.







