Mahaa Daily Exclusive

  ఐసీఎల్‌లో చేరి కెరీర్‌ను చేజార్చుకున్నా…

Share

  • ఐసీఎల్‌లో చేరి కెరీర్‌ను చేజార్చుకున్నా
  • వీవీఎస్ లక్ష్మణ్ ఫోన్ చేసి మందలించారు
  • క్రికెట్ కెరీర్‌పై పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
  • ూట్యూబ్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే

హైదరాబాద్, మహా : తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తూ.. నిత్యం వార్తల్లో నిలిచే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న విషయం చాలా మందికి తెలిసిందే. హైదరాబాద్ రంజీ జట్టు తరఫున ఫాస్ట్ బౌలర్‌గా బరిలోకి దిగిన ఆయన.. అప్పట్లో తన పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను ముప్పుతిప్పలు పెట్టారు. అండర్-19, రంజీ స్థాయిలో ఆడుతూ టీమిండియాకు ఆడాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడ్డారు. అయితే, ఉజ్వలమైన క్రికెట్ భవిష్యత్తు కనిపిస్తున్న తరుణంలోనే ఆయన అనూహ్యంగా ఆటకు వీడ్కోలు పలికారు. క్రికెట్ మైదానాన్ని వదిలి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన కౌశిక్ రెడ్డి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఘనవిజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే, ప్రాణంగా ప్రేమించిన క్రికెట్‌కు ఆయన ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? ఆటను అర్ధాంతరంగా వదిలేసి రాజకీయ బాట పట్టడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? అన్న ప్రశ్నలు అభిమానుల్లో ఎప్పటినుంచో ఉన్నాయి. నేపథ్యంలో తన కెరీర్ మలుపు తిరిగిన సందర్భాన్ని తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

“ఆ రోజుల్లో హైదరాబాద్ నుంచి హయ్యెస్ట్ స్పీడ్‌తో బౌలింగ్ చేసింది నేనే. 140 ప్లస్ స్పీడ్‌తో బౌలింగ్ చేసేవాడిని. ఇప్పుడు నా తర్వాత హైదరాబాద్ నుంచి సిరాజ్ స్పీడ్ బౌలర్‌గా ఉన్నడు. అండర్ -13 నుంచి రంజీ వరకు అన్ని ఫార్మాట్లు ఆడా. దులీఫ్ ట్రోఫీ, దియోదర్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ ఇలా అన్నీ ఆడా. కానీ ఇండియన్ టీంలోకి పోలేకపోయా. నా క్రికెట్ కెరీర్ చాలా అద్భుతంగా ఉండేది. ఐపీఎల్ రాకముందు ఉండే ఐసీఎల్ ఆడా. కానీ బీసీసీఐ ఐసీఎల్‌ను బ్యాన్ చేసింది. అంబటి రాయుడితో సహా.. ఏడుగురం రంజీ ట్రోఫీ ప్లేయర్స్ ఐసీఎల్ ఆడాం.. మా అందరిపై బ్యాన్ పడింది. ఆ తర్వాత నేను క్రికెట్ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చా. నాకు అద్భుతమైన ఘటన గుర్తింది. అది ఎప్పటికీ మర్చిపోలేను.

ముంబై చాలా బలమైన క్రికెట్ టీం. రంజీ ట్రోఫీ టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్ జరిగింది. రోహిత్ కూడా ఆ మ్యాచ్ ఆడాడు. నెక్ టు నెక్ మ్యాచ్ ఉండే. మేం గెలవటానికి 3 వికెట్లు కావాలి.. ముంబై గెలవటానికి 70 పరుగులు కావాలి. రోహిత్ 96 మీద ఆడుతుండు. ఆ రోజును నేను రోహిత్‌ను ఎల్బీడబ్య్లూగా అవుట్ చేశా. ఆ మ్యాచ్ మేం గెలిచాం. అప్పటి వరకు ముంబైని హైదరాబాద్ ఓడించలేదు. కానీ నేను అద్భుతంగా బౌలింగ్ చేసి రోహిత్‌ను అవుట్ చేయటంతో మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చింది. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఇక అండర్-22లో చైన్నైతో మరో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించా. అది కూడా మర్చిపోలేనిది.

అంతకు ముందు దులీఫ్ ట్రోపీలో చాలా అద్భుతంగా ఆడి 5 వికెట్లు తీశా. ఆ తర్వాత ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఉండే. శివలాల్ యాదవ్ చీఫ్ సెలక్టర్. ఆ టూరుకు నేను, ఆర్పీ సింగ్ పోటీలో ఉన్నాం. ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం. నన్ను కాదని.. కాదని ఆర్పీ సింగ్‌ను ఆస్ట్రేలియాకు సెలక్ట్ చేశారు. దీంతో ఆవేశంతో ఐసీఎల్‌లో జాయిన్ అయ్యా. ఆ తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ గారు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి నాకు చాలా క్లాస్ పీకారు. ‘ఎందుకిత తొందరపడి ఐసీఎల్ పోయినవ్.. నీకు మంచి ఫ్యూచర్ ఉంది.. ఇంకా నువ్వు 21 ఏళ్ల కుర్రాడివి.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావ్’ అని లక్ష్మణ్ బాధపడటంతో పాటు నాకు క్లాస్ పీకారు. కానీ అప్పటికే ఐసీఎల్ వెళ్లా.. బీసీసీఐ మాపై బ్యాన్ విధించింది. ఇలా నేను క్రికెట్‌కు దూరమయ్యా.” అని పాడి కౌశిక్ రెడ్డి వెల్లడించారు.

Latest