Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌కు ఉగ్ర ముప్పు….

Share

హైదరాబాద్‌కు ఉగ్ర ముప్పు.
* అప్రమత్తమైన ఖాకీలు!
* కాచిగూడ స్టేషన్‌, హోటల్‌ టూరిస్ట్‌ ప్లాజా లక్ష్యంగా బెదిరింపు మెయిల్‌.
* 26/11 తరహా దాడులతో 300 మందిని హతమారుస్తామంటూ హెచ్చరిక.
* కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారమంటూ లష్కరే తోయిబా పేరుతో సందేశం.
* నగరవ్యాప్తంగా హై అలర్ట్‌.. రద్దీ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు.
హైదరాబాద్‌, మహా:

భాగ్యనగరంలో ఉగ్రదాడులు జరుపుతామంటూ వచ్చిన ఓ బెదిరింపు ఈ-మెయిల్‌ పోలీసు, నిఘా వర్గాల్లో కలకలం రేపింది. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) పేరుతో వచ్చిన ఈ సందేశంలో కాచిగూడ రైల్వే స్టేషన్‌తో పాటు సమీపంలోని హోటల్‌ టూరిస్ట్‌ ప్లాజాను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొనడం సంచలనంగా మారింది. 2008 నవంబర్‌ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తరహాలోనే విరుచుకుపడి, బాంబు పేలుళ్లతో కనీసం 300 మందిని పొట్టనబెట్టుకుంటామని ఆ మెయిల్‌లో హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం.

లతీఫ్‌ భట్‌ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారమంటూ..

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్‌ లతీఫ్‌ భట్‌ హతమైన ఘటనకు ప్రతీకారంగానే హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు ఆ సందేశంలో పేర్కొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా జంగల్‌పోరా ప్రాంతంలో నవంబర్‌ 18న భారత సైన్యం, జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో లతీఫ్‌ భట్‌ హతమయ్యాడు. లొంగిపోవాలని భద్రతా బలగాలు చేసిన హెచ్చరికలను అతడు పెడచెవిన పెట్టి కాల్పులకు తెగబడటంతో జవాన్లు మట్టుబెట్టారు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే హైదరాబాద్‌కు బెదిరింపు మెయిల్‌ రావడం గమనార్హం.

రంగంలోకి స్పెషల్‌ బ్రాంచ్‌.. కట్టుదిట్టమైన భద్రత.

బెదిరింపు మెయిల్‌ అందిన వెంటనే అప్రమత్తమైన హైదరాబాద్‌ నగర పోలీసు స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగం నవంబర్‌ 21న అన్ని విభాగాలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా పేర్కొనడంతో ఎక్కడా ఏ చిన్న పొరపాటుకు తావివ్వకూడదని ఉన్నతాధికారులు ఆదేశించారు. నగరంలోని అన్ని జోన్ల డీసీపీలు, ఏసీపీలు, శాంతిభద్రతల విభాగం, టాస్క్‌ఫోర్స్‌, ట్రాఫిక్‌ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్‌, హోటల్‌ టూరిస్ట్‌ ప్లాజా పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు, సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ప్రార్థనా మందిరాల వద్ద నిఘాను పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు, గుర్తుతెలియని బ్యాగులు, నిర్లక్ష్యంగా వదిలివెళ్లిన వాహనాలపై డేగకన్ను వేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు అందాయి.

ఆకతాయిల పనా? ఉగ్రవాదుల కుట్రనా?

మరోవైపు ఈ బెదిరింపు మెయిల్‌ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు సైబర్‌ క్రైమ్‌, నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి. ఈ సందేశం నిజంగానే ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిందా, లేక ఉగ్రవాదుల పేరును వాడుకుని ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్‌ వచ్చిన ఐపీ అడ్రస్‌, సర్వర్‌ వివరాలను సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలోనూ శంషాబాద్‌ విమానాశ్రయం, పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్‌ రాగా, తనిఖీల అనంతరం అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులుగా తేలాయి. అయినప్పటికీ ప్రస్తుత హెచ్చరికలో కీలక ప్రాంతాల ప్రస్తావన ఉండటంతో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్‌ 100కు సమాచారం అందించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.