మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభాస్ మద్దతు!
• ‘నషాముక్త్ భారత్’ యాత్రకు రెబల్ స్టార్‌ను ఆహ్వానించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.
• ప్రత్యేక టీ-షర్టులు, పోస్టర్‌ను ఆవిష్కరించిన కిషన్‌రెడ్డి, ప్రభాస్
హైదరాబాద్, మహా.
యువత బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘నషాముక్త్ భారత్’ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మహా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని ప్రభాస్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కాసేపు ముచ్చటించిన అనంతరం, “డ్రగ్స్ రహిత భారత్ కోసం మనమందరం గొంతు విప్పుదాం” అనే నినాదంతో నిర్వహిస్తున్న ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషాముక్త్ భారత్’ యాత్రకు సంబంధించిన ప్రత్యేక టీ-షర్టులు, ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రభాస్ పిలుపునిస్తే యువతలో పెను చైతన్యం: కిషన్‌రెడ్డి.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కేవలం ప్రభుత్వాల చర్యలతోనే సాధ్యం కాదని, ఇందులో సినీ ప్రముఖులు, సామాన్య ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కోట్లాది మంది అభిమానులను, ముఖ్యంగా యువతను ప్రభావితం చేయగల అపారమైన శక్తి ప్రభాస్‌కు ఉందని కొనియాడారు. రెబల్ స్టార్ లాంటి అగ్ర హీరో ఈ ఉద్యమంలో భాగమై ఒక్క పిలుపు ఇస్తే యువతలో పెను మార్పు, గొప్ప చైతన్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును కాపాడుకోవడానికి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవడానికి తన వంతు సహకారం అందిస్తానని ప్రభాస్ భరోసా ఇచ్చారు.
ఈ నెల 25 నుంచి మూడు రోజుల పాటు పాదయాత్ర
హైదరాబాద్ వేదికగా నవంబర్ 25, 26, 27 తేదీల్లో మూడు రోజుల పాటు ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషాముక్త్ భారత్’ పేరుతో కిషన్‌రెడ్డి నేతృత్వంలో భారీ పాదయాత్ర జరగనుంది. అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు సాగే ఈ యాత్రకు సినీ పరిశ్రమ నుంచి విస్తృత మద్దతు కూడగట్టేందుకు కిషన్‌రెడ్డి విశేష కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆయన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌తో పాటు ప్రముఖ దర్శకులు సుకుమార్, బోయపాటి శ్రీనులను స్వయంగా కలిసి ఆహ్వానించగా, వారంతా ఈ యాత్రకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ సంకల్పం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ సంకల్పానికి అనుగుణంగా, 2029 నాటికి దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా చేపడుతున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. భావితరాల భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞంలో యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజలు పెద్దఎత్తున స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.








